Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్ మెగా ఆక్షన్ రసవత్తరంగా సాగుతోంది. రెండు రోజుల పాటు సాగే మెగా ఆక్షన్ ఇది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీల అధినేతలు ఈ వేలానికి హాజరయ్యారు. తొలి రోజున 84 మంది ప్లేయర్లు రేసులో నిలిచారు. వారికోసం వేలం సాగుతోంది.

ఈ వేలం పాటలో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ల హవా వీచింది. టీమిండియా వికెట్ కీపర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రిషభ్ పంత్.. ఈ మెగా ఆక్షన్‌లో రికార్డు రేటుకు అమ్ముడుపోయాడు. మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్‌గా నిలిచాడు. 27 కోట్ల రూపాయలతో అతన్ని జట్టులోకి తీసుకుంది లక్నో సూపర్ జెయింట్స్.
అదే సమయంలో మరో లెఫ్ట్ హ్యాండర్ డేవిడ్ మిల్లర్‌నూ కొనుగోలు చేసిందీ ఫ్రాంఛైజీ. 7.50 కోట్ల రూపాయల మొత్తాన్ని ఈ దక్షిణాఫ్రికా స్పెషలిస్ట్ ప్లేయర్‌పై ఇన్వెస్ట్ చేసింది. 2024 సీజన్ వరకూ అతను గుజరాత్ టైటాన్స్‌లో కొనసాగాడు. అతన్ని రిలీజ్ చేసిందా మేనేజ్‌మెంట్. దీనితో మెగా ఆక్షన్‌లోకి వచ్చాడు. విన్నింగ్ హ్యాండ్ అతనిది.
ఇప్పటికే ఎల్‌ఎస్జీలో మరో లెఫ్ట్ హ్యాండర్ నికొలస్ పూరన్ ఉన్నాడు. 21 కోట్ల రూపాయలతో ఎల్‌ఎస్జీ అతన్ని రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌కు చెందిన ఈ విధ్వంసకారుడితో ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు జట్టు కట్టనున్నారు. రిషభ్ పంత్, పూరన్, డేవిడ్ మిల్లర్‌తో లక్నో సూపర్ జెయింట్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్.. అత్యంత బలోపేతంగా తయారైందనడంలో సందేహాలు అక్కర్లేదు.