Krunal Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్ రెండో రోజు మెగా ఆక్షన్ రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి.
వేలం పాటలో నిఖార్సయిన టీ20 స్పెషలిస్టులను సెలెక్ట్ చేసుకుంటోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో మెరుపులు మెరిపించగల ప్లేయర్లకు జట్టులో చోటు కల్పిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే నలుగురు స్పెషలిస్టుల కోసం ఏకంగా 43.75 కోట్ల రూపాయలను గుమ్మరించింది.

ఈ మెగా ఆక్షన్‌లో టీ20 స్పెషలిస్టులు వికెట్ కీపర్ బ్యాటర్లు లియామ్ లివింగ్‌స్టొన్, జితేష్ శర్మతో పాటు డాషింగ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్, పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌ను పిక్ చేసింది. ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టొన్- రూ.8.75 కోట్లు, ఫిల్ సాల్ట్- 11.50 కోట్లు, టీమిండియా ప్లేయర్ జితేష్ శర్మ- 11 కోట్లు, ఆస్ట్రేలియాకు చెందిన హేజిల్‌వుడ్- 12.50 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది.
ఇప్పుడు తాజాగా ఇదే లిస్ట్‌లో వచ్చి చేరాడు మరో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో మెరుపులు మెరిపించగల సమర్థుడు. 2024 సీజన్ వరకూ లక్నో సూపర్ జెయింట్స్‌లో ఆడాడు. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ క్యాంప్‌లో వచ్చి చేరాడు.
అతని కోసం రాజస్థాన్ రాయల్స్‌తో గట్టిగా ఫైట్ చేయాల్సొచ్చింది ఆర్సీబీకి. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ కమ్ హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ కోసం ఈ రెండు జట్లూ పోటీ పడ్డాయి. చివరికి 5.75 కోట్ల రూపాయల వద్ద బెంగళూరు అతన్ని దక్కించుకుంది. ఆర్టీఎమ్ ఆప్షన్ ఉన్నప్పటికీ- దాన్ని వినియోగించుకోలేదు లక్నో సూపర్ జెయింట్స్.
తాజాగా కృనాల్ పాండ్యా చేరికతో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ బలపడినట్టే. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, లియామ్ లివింగ్‌స్టొన్, జితేష్ శర్మ.. వంటి మెరికలతో జట్టు బలంగా కనిపిస్తోంది. ఈ లిస్ట్‌లో కృనాల్ వచ్చి చేరడం అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో మరింత రాటుదేలినట్టయింది.