Kane Williamson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్ రెండో రోజు మెగా ఆక్షన్ రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి.
ఈ దఫా మెగా ఆక్షన్‌లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. న్యూజిలాండ్ మాజీ కేప్టెన్, అన్ని ఫార్మట్లల్లో ఫిట్ అనిపించుకోగల కెపాసిటీ ఉన్న కేన్ విలియమ్సన్ అమ్ముడు పోలేదు. రెండో రోజు తొలి రౌండ్‌లో అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ కూడా ముందుకు రాలేదు. సుదీర్ఘకాలం అతన్ని అట్టి పెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సహా ఏ టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఆసక్తి చూపలేదు.

అదే పరిస్థితి ఆస్ట్రేలియాకు చెందిన డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఎదుర్కొన్నాడు. ఈ వేలం పాటలో అతను అమ్ముడుపోలేదు. టీ20 ఫార్మట్‌లో టన్నలు కొద్దీ పరుగులు చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్‌ను తీసుకోవడానికి ఏ ఫ్రాంఛైజీ కూడా ముందుకు రాలేదు.
2009లో ఐపీఎల్‌లో అడుగు పెట్టిన తరువాత 2024 సీజన్ వరకూ కొనసాగుతూ వచ్చాడు డేవిడ్ వార్నర్. మధ్యలో 2018 సీజన్‌లో మాత్రమే అతను అందుబాటులో లేకుండా పోయాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో అతను చేసిన పరుగులు 6,565. ఇందులో ఏకంగా నాలుగు సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 40.52 బ్యాటింగ్ యావరేజ్‌ను రికార్డ్ చేశాడు. 139.77 స్ట్రైక్‌రేట్‌ను స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఘనత డేవిడ్ వార్నర్‌ది. 2016 సీజన్ ఫైనల్స్‌లో అతని కేప్టెన్సీలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి కప్‌ను సొంతం చేసుకుంది ఆరెంజ్ ఆర్మీ. ఫైనల్స్‌లో 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ సీజన్ మొత్తం మీద 848 పరుగులు చేశాడు.
ఇంతటి అద్భుత ట్రాక్ రికార్డ్ ఉన్న డేవిడ్ వార్నర్ ఈ సారి ఎవరికీ అక్కరకు రానట్టే కనిపించింది. దీనికి కారణాలు లేకపోలేదు. 2024 సీజన్‌లో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. ఎనిమిది మ్యాచ్‌లల్లో అతను చేసింది 168 పరుగులే. వయస్సు 38 సంవత్సరాలకు చేరుకోవడం, అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగడం, ఈ మధ్యకాలంలో గాయాలబారిన పడటం వల్ల అతన్ని జట్టులోకి తీసుకోవడానికి ఈ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు.