మరికాసేపట్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్తాడు? గత వేలం రికార్డులు బద్దలవుతాయా? అధిక ధర ఏ ప్లేయర్ పలుకుతాడు? అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం దొరకనుంది. భారత ప్లేయర్లు శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్; విదేశీ సీనియర్లు మిచెల్ స్టార్క్, కమిన్స్‌తో పాటు యువ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, గెరాల్డ్ కొయెట్జీకి భారీ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తొలిసారి భారత్ వెలుపల ఈ సారి ఐపీఎల్ వేలాన్ని నిర్వహిస్తున్నారు.దుబాయ్ వేదికగా ఈ మినీ వేలం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. మల్లిక సాగర్ ఆక్షనీర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 16 ఏళ్ల ఐపీఎల్ వేలం చరిత్రలో తొలిసారి మహిళ ఆక్షనీర్‌గా పాల్గొంటుంది. అయితే వేలం చరిత్రలో మరో ప్రత్యేకత చోటుచేసుకుంది.

ఈ సారి ఐపీఎల్ వేలానికి ప్రేక్షకులు కూడా పాల్గొంటున్నారు. దుబాయ్‌లోని కోకాకోలా అరీనా వేదికగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేదికలో ప్రేక్షకులకు సీటింగ్ సామర్థ్యం కూడా ఉంది. కాగా, స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో కూడా ఐపీఎల్ వేలం లైవ్ చూడొచ్చు.
అయితే ఈ వేలంలో 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఖాళీలు 77 మాత్రమే ఉన్నాయి. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది.ప్రతి జట్టులో అత్యధికంగా 25 మంది ప్లేయర్లు మాత్రమే ఉండాలి. వారిలో 8 మంది మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండాలి.
దీని ప్రకారం అధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో 12 ఖాళీలు ఉన్నాయి. తర్వాత దిల్లీ క్యాపిటల్స్ లో 9 ఖాళీలు; ఇక గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలో 8 ఖాళీలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లలో ఆరు ఖాళీలు ఉన్నాయి.
ఫ్రాంచైజీల వారీగా అందుబాటులో ఉన్న పర్స్ వాల్యూ:
1. చెన్నై సూపర్ కింగ్స్-రూ. 31.4 కోట్లు
2. ఢిల్లీ క్యాపిటల్స్ -రూ.28.95 కోట్లు
3. గుజరాత్ టైటాన్స్ -రూ. 38.15 కోట్లు
4. కేకేఆర్ -రూ. 32.7 కోట్లు
5.ఎల్‌ఎస్‌జీ -రూ. 13.5 కోట్లు
6.ముంబై ఇండియన్స్ -రూ.17.75 కోట్లు
7. పంజాబ్ కింగ్స్ -రూ. 29.1 కోట్లు
8. ఆర్‌సీబీ -రూ.23.25 కోట్లు
9. రాజస్థాన్ రాయల్స్ -రూ. 14.5 కోట్లు
10. ఎస్‌ఆర్‌హెచ్ -రూ. 34 కోట్లు