
పాతవారిని పోగొట్టుకున్నా..
ఈ సీజన్‌లో అమలు చేసిన రిటెన్షన్ విధానం వల్ల జట్టును పునర్వ్యవస్థీకరించాల్సిన పరిస్థితిని ఎదుర్కొందీ జట్టు. కేప్టెన్ ధోని సహా మరో ముగ్గురిని రిటైన్ చేసుకుంది. మిగిలిన వారిని మెగా వేలంపాట కోసం విడుదల చేసింది. ఫలితంగా- జట్టు ఎక్కడ బలహీనపడుతుందోననే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. మళ్లీ కొత్త వారిని తీసుకోవాల్సి వస్తే- వారు ఎలా ఆడతారోననే బెంగ కనిపించింది. ఫ్రాంఛైజీ సైతం అదేరకంగా ఆందోళన చెందినట్టుంది.

పాత జట్టులో మెరికల్లాంటి వారికోసం..
అందుకే పాత జట్టును సమకూర్చుకునే ప్రయత్నాలు పడింది. పాత ముఖాలను కొనుగోలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చింది. కొత్తవారిని తీసుకుంటే జట్టు కూర్పు దెబ్బతింటుందనే ఉద్దేశంలో కనిపించిందా ఫ్రాంఛైజీ యాజమాన్యం. ఇందులో భాగంగా- ఇవ్వాళ బెంగళూరులో రసవత్తరంగా సాగుతోన్న ఐపీఎల్ సీజన్ 2022 మెగా వేలంపాటలో ఇప్పటిదాకా నలుగురు పాత ప్లేయర్లనే జట్టులోకి తీసుకుంది. వారికోసం కోట్ల రూపాయలను ధారబోయడానికీ వెనుకాడలేదు.

నలుగురు పాతవారే..
ఫాస్ట్ బౌలర్లు డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్‌ను తిరిగి జట్టులో చోటు కల్పించింది. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అంబటి రాయుడు, రాబిన్ ఊతప్పను తీసుకుంది. ఈ నలుగురు ఇదివరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడినవారే. అదే సమయంలో మరో ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్‌ను మళ్లీ జట్టులోకి తీసుకోవడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అతని కోసం ఢిల్లీ కేపిటల్స్, పంజాబ్ కింగ్స్ పోటీ పడినప్పటికీ.. అందులో చెన్నై సూపర్ కింగ్స్ తలదూర్చలేదు.

రైనాను పక్కన పెట్టిన సీఎస్‌కే..
అన్నింటికంటే ఆశ్చర్యకరంగా మిస్టర్ ఐపీఎల్‌గా గుర్తింపు పొందిన సురేష్ రైనాను కొనుగోలు చేయలేదు. ఐపీఎల్ ఫార్మట్‌లో అయిదువేలకు పైగా పరుగులు చేసిన సురేష్ రైనాను పక్కన పెట్టింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ జట్టు మాత్రమే కాదు..మిగిలిన వారెవరూ జట్టులోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు. గత సీజన్‌లో అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వెనక్కి తిరిగి రావడమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

పాత జట్టుకే ప్రాధాన్యత..
అలాగే- వెటరన్ స్పిన్నర్, దక్షిణాఫ్రికాకు చెందిన ఇమ్రాన్ తాహిర్ కోసమూ ప్రయత్నించలేదు. కాగా- చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న వారిలో కేప్టెన్ ధోని, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ ఉన్నారు. తాజాగా ఈ నలుగురికి డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప జత కలిశారు. పాత ముఖాలను తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఎంఎస్ ధోని మంత్రాంగం నడిపించినట్టే కనిపిస్తోంది. తన బ్రాండ్‌ను పోగొట్టుకోకుండా.. జట్టు కూర్పు దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తపడినట్టే.

దీపక్ చాహర్ కోసం
దీపక్ చాహర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 14 కోట్ల రూపాయలను వ్యయం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఫ్రాంఛైజీ ఇద్దరు టాప్ క్లాస్ క్రికెటర్లు దీపక్ చాహర్, రవీంద్ర జడేజాలకు ఇచ్చే శాలరీ 30 కోట్ల రూపాయలు. అంబటి రాయుడుకు 6 కోట్ల 75 లక్షలు, డ్వేన్ బ్రావోకు 4.4 కోట్ల రూపాయలను వ్యయం చేసింది. రాబిన్ ఊతప్పపై రెండు కోట్లు పెట్టింది.


Click it and Unblock the Notifications












