
వేలంపాటలో పాల్గొనే ఫ్రాంఛైజీలు ఇవే..
ఐపీఎల్ 2022 మెగా టోర్నమెంట్‌లో పాల్గొనే ఫ్రాంఛైజీల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా జాయిన్ అయ్యాయి. పాత ఫ్రాంఛైజీలు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలానికి హాజరు కానున్నాయి. రిటైనింగ్ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యంలో- ఒక్కో జట్టులో కొత్త ముఖాలు పెద్ద సంఖ్యలో వచ్చి చేరనున్నాయి.

10 ఫ్రాంఛైజీల్లో..
అన్ని ఐపీఎల్ ఫ్రాంఛైజీలు మొత్తంగా 33 మంది క్రికెటర్లను రిటైన్ చేసుకున్నాయి. కొన్ని జట్లల్లో నలుగురు.. మరి కొన్నింట్లో ముగ్గురేసి చొప్పున క్రికెటర్లను ఆయా ఫ్రాంఛైజీలు అట్టి పెట్టుకున్నాయి. తమ జట్లు తురుఫుముక్కలుగా భావించిన ప్లేయర్లకు కోట్ల రూపాయలను చెల్లించి రిటైన్ చేసుకున్నాయి. మెగా వేలంపాట కోసం వారిని రిలీజ్ చేయలేదు. కొత్తగా జాయిన్ అయిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటన్స్ సైతం ముగ్గురు చొప్పున ప్లేయర్లను ముందే కొనుగోలు చేశాయి.

రూ.900 కోట్ల బడ్జెట్..
ఫ్రాంఛైజీలన్నీ 900 కోట్ల రూపాయల బడ్జెట్‌ను వేలంపాటల కోసం కేటాయించాయి. ఇందులో 338.5 కోట్ల రూపాయలను రిటైనింగ్ ప్లేయర్ల కోసం ఖర్చు చేశాయి. ఈ మొత్తం పోగా.. 561.5 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో మిగిలిన క్రికెటర్లందరినీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాయి. ఐపీఎల్ మెగా వేలానికి సన్నద్ధం అయ్యాయి.

ఫ్రాంఛైజీలవారీగా రిటైనింగ్ ప్లేయర్లు వీరే..
మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీగా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. కేప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ కీరన్ పొల్లార్డ్‌ను అట్టి పెట్టుకుంది. రోహిత్ శర్మ-16, బుమ్రా-12, సూర్యకుమార్ యాదవ్-8, కీరన్ పొల్లార్డ్-6 కోట్ల రూపాయలను చెల్లించింది. ఈ నలుగురు పోనూ మిగిలిన వారిని జట్టులోకి తీసుకోనుంది.

చెన్నై సూపర్ కింగ్స్‌లో..
సెకెండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్.. ఊహించినట్టే కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రిటైన్ చేసుకుంది. దీనికోసం ఆయనకు 12 కోట్ల రూపాయలను చెల్లించింది. రవీంద్ర జడేజా-16, మొయిన్ అలీ-8, రుతురాజ్ గైక్వాడ్-6 కోట్ల రూపాయలను చెల్లించి, అట్టి పెట్టుకుంది. కోల్‌కత నైట్ రైడర్స్‌లో ఆండ్రీ రస్సెల్-12, వరుణ్ చక్రవర్తి-8, వెంకటేష్ అయ్యర్-8, సునీల్ నరైన్-6 కోట్ల రూపాయలతో రిటైన్ అయ్యారు.

రాజస్థాన్ రాయల్స్‌లో
రాజస్థాన్ రాయల్స్‌లో సంజు శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ జట్టులో కొనసాగుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ రిటైన్ అయ్యారు. విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ విడుదల చేయలేదు. రిషభ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, ఎన్రిచ్ నోర్ట్జె ఢిల్లీ కేపిటల్స్‌లోనే కొనసాగుతున్నారు. కొత్తగా జాయిన్ అయిన లక్నో సూపర్‌జెయింట్స్.. కేఎల్ రాహుల్‌ను 17 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. అతనితో పాటు మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకుంది. లక్నో టీమ్‌కు కేఎల్ రాహుల్ కేప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

గుజరాత్ టైటన్స్‌లో..
గుజరాత్ టైటన్స్ హార్ధిక్ పాండ్యాను 15 కోట్ల రూపాయలకు తీసుకుంది. కేప్టెన్‌గా అపాయింట్ చేసింది. పాండ్యాతో సమానంగా స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు 15 కోట్ల రూపాయలను చెల్లించి- జట్టులోకి తీసుకుంది. కోల్‌కత నైట్ రైడర్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను తీసుకుంది. దీనికోసం అతనికి ఎనిమిది కోట్ల రూపాయలను చెల్లించింది. మిగిలిన క్రికెటర్లను తీసుకోవడానికి ఆయా ఫ్రాంఛైజీలన్నీ బెంగళూరులో జరిగే మెగా ఆక్షన్‌లో పాల్గొనబోతోన్నాయి. ఈ వేలం- శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications
