
కోల్‌కతా: ఐపీఎల్-2020 ఆటగాళ్ల వేలంలో విదేశీ ఆటగాళ్లతో పాటు భారత అండర్-19 ఆటగాళ్లు కూడా సత్తా చాటారు. కమ్మిన్స్, మ్యాక్స్‌వెల్ అంత భారీ ధరకు అమ్ముడుపోకపోయినా.. వేలంలో ఫర్వాలేదనిపించారు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్ కప్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహారించనున్న ప్రియమ్ గార్గ్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలో రూ. కోటి 90 లక్షలకు కొనుగోలు చేసింది. గార్గ్ కనీస ధర రూ. 20 లక్షలు ఉండగా.. పలు ఫ్రాంఛైజీలు కోసం పోటీ పడ్డాయి.
కనీసధర రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన అండర్-19 ఆటగాడు విరాట్ సింగ్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం రూ. 1.9 కోట్లు పెట్టిన వేలంలో సొంతం చేసుకుంది. ఇక యశస్వి జైస్వాల్‌ను రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. జైస్వాల్‌ను రూ. 2.40 కోట్లకు రాజస్తాన్ చేజిక్కించుకుంది. గార్గ్-జైస్వాల్‌ల కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ పంజాబ్‌లు వీరి కోసం ఆసక్తి చూపాయి.
కర్ణాటకకు చెందిన వరుణ్ చక్రవర్తి కోసం కేకేఆర్, ఆర్సీబీ పోటీ పడ్డాయి. అయిత వేలంలో చివరకు అతడిని రూ. 4 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది. దీపక్ హుడా కనీస ధర రూ. 40 లక్షలు ఉండగా అతన్ని రూ. 50 లక్షలకు కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది. వికెట్ కీపర్ అనుజ్ రావత్ను వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 80 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. డానియేల్ శామ్స్, పవన్ దేశ్‌పాండే, షారుక్ ఖాన్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి చూపలేదు.
యువ ఆటగాడు ఇషాన్ పోరెల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వేలంలో రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. కనీస ధరతో వేలంలోకి వచ్చిన సిద్ధార్ధ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ వేలంలో సొంతం చేసుకుంది. రంజీ ఆటగాడు రవి బిష్ణోయికి మంచి ధర లభించింది. వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అతడిని రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. దేశవాళీ క్రికెటర్లు రైలీ మీరితీర్థ్, కేసీ కరియప్పలను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు.
యువ ఆటగాడు కేదార్ దేవధర్, ఆంధ్ర రంజీ జట్టు వికెట్ కీపర్ కేఎస్ భరత్, ప్రభసిమ్రన్ సింగ్, అంకుష్ బెయిన్స్, తుషార్ దేశ పాండే, కుల్వంత్ ఖేజ్రోలియా, విష్ణు వినోద్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఇక యువ బౌలర్ అక్షయ్ సింగ్‌ను వేలంలో రాజస్థాన్ రాయల్స్ కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.