
పాఠశాల స్థాయి నుంచే క్రికెట్
నిన్నటిదాకా అనామకుడిగా ఉన్న వరుణ్ చక్రవర్తి పాఠశాల స్థాయిలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. 13 ఏళ్లకే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన వరుణ్ చక్రవర్తి.. 17 ఏళ్లు వచ్చే వరకు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్‌గా సేవలందించాడు. వయసు తక్కువగా ఉండటంతో ఏజ్ గ్రూప్ టోర్నీల్లో అతన్ని తీసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు.

క్రికెట్‌ను విడిచిపెట్టి ఐదేళ్ల ఆర్కిటెక్చర్ కోర్సు
ఈ క్రమంలో పన్నెండో తరగతి వరకు క్రికెట్‌లోనే కొనసాగాడు. ఆ తర్వాత క్రికెట్‌ను విడిచిపెట్టి ఐదేళ్ల ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. అనంతరం రెండేళ్ల పాటు ఓ కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాడు. ఆ తర్వాత మళ్లీ అతడికి క్రికెట్‌పై మనసు మళ్లడంతో ఉద్యోగం వదిలేసి క్రోమ్ బెస్ట్ క్రికెట్ క్లబ్ తరఫున సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఆట మొదలుపెట్టాడు.

మోకాలి గాయంతో స్పిన్నర్‌గా
అయితే రెండో మ్యాచ్‌లోనే మోకాలి గాయంతో స్పిన్నర్‌గా అవతారమెత్తాడు. కానీ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ అతడి బౌలింగ్‌లో భారీగా పరుగులు సాధిస్తుండటంతో స్పిన్‌లో కొత్త మెలకులను నేర్చుకున్నాడు. ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్, గూగ్లీ, క్యారమ్ బాల్, ఫ్లిప్పర్, టాప్ స్పిన్, స్లైడర్ ఏమ్‌డ్ టోస్ యార్కర్ ఇలా ఏడు రకాల భిన్నమైన బంతులను వేయగల నేర్పరి వరుణ్.

మిస్టరీ స్పిన్నర్‌గా గుర్తింపు
గత తమిళనాడు ప్రిమియర్ లీగ్‌లో చక్కటి ప్రదర్శనతో మిస్టరీ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఏడాది నాలుగో డివిజన్ క్రికెటర్‌గా ఉన్న వరుణ్.. ఈ ఏడాది తమిళనాడు తరఫున విజయ్ హజారె ట్రోఫీతో పాటు రంజీల్లోనూ ఆడేశాడు. అన్ని చోట్లా రాణించి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు. దీంతో వేలంలో అత్యధిక ధర పలికి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఐపీఎల్ వేలం అనంతరం వరుణ్ మాట్లాడుతూ
ఐపీఎల్ వేలం అనంతరం వరుణ్ మాట్లాడుతూ "ఉద్యోగంలో ఉన్నపుడు లోలోన ఒత్తిడికి గురయ్యాను. నా మనసు అక్కడ లేదని తల్లిదండ్రులకు చెప్పేశాను. ఆరేళ్ల పాటు వాడకుండా ఉండిపోయిన క్రికెట్ కిట్ బయటికి తీశాను" అని మూడేళ్ల కిందట తాను తీసుకున్న నిర్ణయం గురించి చెప్పాడు.
రూ.20 లక్షలే దక్కుతుందని అనుకున్నా
"వేలంలో నాకు కనీస ధర రూ.20 లక్షలే దక్కుతుందని అనుకున్నా. వేలం జరుగుతున్నంత సేపు దేవుడా దేవుడా అనుకుంటూనే ఉన్నా. నాకు ఈ రేటు వస్తుందని అసలు ఊహించలేదు" అని వరుణ్ తెలిపాడు. అయితే, తన రాష్ట్రానికి చెందిన వరుణ్ ప్రతిభను గుర్తించిన పంజాబ్ కెప్టెన్ అశ్విన్ ఫ్రాంఛైజీ యాజమాన్యానికి గట్టిగా చెప్పి అతడిని కొనుగోలు చేయించినట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications
