మరి కొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోవడం ఖాయమే. అయితే దాని కంటే ముందుగా కొన్ని ప్రాంఛైజీల్లో కోచింగ్ సిబ్బందిలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ రికీ పాంటింగ్‌ను తప్పించింది. రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు అందుకోనున్నాడని తెలుస్తోంది. గతంలో రాజస్థాన్ ఫ్రాంచైజీలో కొనసాగిన ద్రవిడ్ తిరిగి అదే గూటికి వెళ్తున్నాడు.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ కోచింగ్ సిబ్బందిలోనూ మార్పులు జరగనున్నాయి. ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకీ గుజరాత్ టైటాన్స్‌ను వీడనున్నారు. అయితే వారిద్దరు స్వతహాగా తప్పుకుంటున్నారా లేదా ఫ్రాంచైజీ తప్పిస్తుందా అనే విషయంపై స్పష్టత లేదు. కానీ ఫ్రాంచైజీతో వారిద్దరి బంధం ముగిసిందని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆది నుంచి గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీతో నెహ్రా ఉన్నాడు. మూడు సీజన్లలో రెండు సార్లు జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఫుట్‌బాల్ కోచ్ తరహాలో బౌండరీ వెంబడి తిరుగుతూ జట్టు విజయాల్లో నెహ్రా కీలక పాత్ర పోషించాడు. అయితే హార్దిక్-నెహ్రా కాంబినేషన్ హిట్ అయ్యింది. కానీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌కు వెళ్లడంతో శుభ్‌మన్ గిల్ సారథిగా జట్టు బాధ్యతలు అందుకున్నాడు. మరోవైపు గాయంతో మహ్మద్ షమి కూడా జట్టుకు దూరమవ్వడంతో గత సీజన్‌లో గిల్-నెహ్రా జోడీ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది.
ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేదు. అయితే ఈ నేపథ్యంలో సిక్సర్లు వీరుడు యువరాజ్ సింగ్‌ను ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందివ్వాలని గుజరాత్ ఫ్రాంచైజీ భావిస్తోంది. అంతేగాక యువీతో కలిసి ఫ్రాంచైజీ చర్చలు కూడా జరుపుతోంది. యువరాజ్ కూడా ఆసక్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ''భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నెహ్రా, విక్రమ్ సోలంకీ వెళ్తున్నారు. యువరాజ్‌తో చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికి అయితే ఏదీ ఖరారు కాలేదు. కానీ తప్పక మార్పులు జరుగుతాయి'' అని గుజరాత్ టైటాన్ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి.