
ప్రపంచకప్ నిర్వహణపై నీలినీడలు
భారత కేంద్ర కేంద్రం మే 3వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఐపీఎల్-13ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆరు నెలల పాటు తమ సరిహద్దులను మూసివేసింది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ నిర్వహణకు ఏర్పాట్లు చేయడం ఐసీసీకి సమస్యగా మారింది.

ఆస్ట్రేలియాలో కష్టం
త్వరలో కరోనా వ్యాప్తి సమస్యలు తీరితే.. ఐపీఎల్‌తో పాటు టీ20 ప్రపంచకప్ కూడా భారత్‌లోనే నిర్వహించవచ్చని సునీల్ గవాస్కర్ అన్నారు. సన్నీ ఓ టీవీ చానెల్‌తో మంగళవారం మాట్లాడుతూ... 'సెప్టెంబర్ 30వరకు వేరే దేశాల నుంచి ఎవరూ రాకుండా ఆస్ట్రేలియా నిషేధం విధించింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ మూడో వారం నుంచి టీ20 ప్రపంచకప్ జరగాల్సింది. అయితే ప్రస్తుతం ఉన్న ఆంక్షల వల్ల అది చాలా కష్టం' అని అన్నారు.

ఒప్పందం చేసుకోవాలి
'ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహించేందుకు భారత్, ఆస్ట్రేలియా ఒప్పందం చేసుకోవాలి. ఒకవేళ భారత్‌లో కరోనా ప్రభావం తగ్గితే.. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో టీ20 ప్రపంచకప్ ఇక్కడ నిర్వహించాలి. వచ్చే ఏడాది భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ టోర్నీని ఆస్ట్రేలియాకు బదిలీ చేయాలి. అలా అయితే ఈ ఏడాది విశ్వకప్ జరిగే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఈ టోర్నీకి కొన్ని వారాల ముందు ఐపీఎల్ పెడితే.. అది ప్రపంచకప్‌కి ప్రాక్టీస్‌లా ఉంటుంది' అని సన్నీ సూచించారు.

గవాస్కర్ భారీ విరాళం
సునీల్ గవాస్కర్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. మహమ్మారి కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటానికి తన వంతు సాయంగా రూ.59 లక్షలు విరాళంగా ఇచ్చాడు. దీనిలో రూ.35 లక్షలు పీఎం కేర్స్‌కు, రూ.24 లక్షలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాడు. అయితే ఈ విషయాన్ని లిటిల్ మాస్టర్ నేరుగా ప్రకటించలేదు. ముంబై మాజీ కెప్టెన్ అమోల్ మజుందార్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించారు. 1971 నుంచి 1987 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన గావస్కర్ మొత్తం 35 సెంచరీలు చేశారు. ఇందులో 34 సెంచరీలు టెస్టు ఫార్మాట్‌లో, ఒక సెంచరీ వన్డే ఫార్మాట్‌లో చేశారు.


Click it and Unblock the Notifications
