
టీ20 ఫార్మాట్ క్రికెట్టే కాదు:
తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మైఖేల్ హోల్డింగ్ మాట్లాడుతూ టెస్టు క్రికెట్‌లో విండీస్ దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశాడు. 'వెస్టిండీస్ రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌లు గెలిచింది. టీ20 టోర్నీని గెలవడం పునరుజ్జీవం కాదు. ఎందుకంటే అది అసలు క్రికెట్టే కాదు. టెస్టు క్రికెట్‌లో విండీస్ అగ్రస్థానంలో నిలవడం చాలా కష్టమవుతుంది. ఈ పరిస్థితి టీ20 ఫార్మాట్ కారణంగానే వచింది. చాలామంది విండీస్ ఆటగాళ్లు దేశం కోసం టెస్ట్ క్రికెట్ ఆడడం లేదు' అని కామెంటేటర్ మైఖేల్ హోల్డింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

జాతీయ జట్టు తరఫున ఆడటం లేదు:
'ప్రపంచవ్యాప్తంగా టీ20 టోర్నమెంట్లు ఆటను ప్రభావితం చేస్తున్నాయి. ఓ చిన్న లేదా పేద దేశం.. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డుల మాదిరి ఆటగాళ్లకు వేతనం చెల్లించలేవు. అందుకే ఆటగాళ్లు టీ20 క్రికెట్ ఆడేందుకు ఇష్టపడుతున్నారు. దీంతోనే వెస్టిండీస్ లాంటి ఇతరుల దేశాలు దెబ్బతింటున్నాయి. గత కొన్నేళ్లుగా పలువురు వెస్టిండీస్ క్రికెటర్లు జాతీయ జట్టు తరఫున ఆడటం కంటే.. ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడటానికి మక్కువ చూపిస్తున్నారు. వేతన వివాదాలపై బోర్డు మరియు ఆటగాళ్ల మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. ఆటగాళ్లు మాత్రం ఏం చేయగలరు' అని హోల్డింగ్ పేర్కొన్నారు.

క్రికెట్‌కు మాత్రమే కామెంటరీ చెబుతా:
'ఆరు వారాల్లో 6 లేదా 8 లక్షల డాలర్లు వస్తున్నప్పుడు ప్లేయర్స్ మాత్రం ఏం చేస్తారు. నేను క్రికెటర్లను నిందించడం లేదు. కేవలం నిర్వాహకులను మాత్రమే విమర్శిస్తున్నా. ప్లేయర్స్ టెస్ట్ క్రికెట్‌కు చాలా సేవలు చేయాల్సి ఉంది. కానీ వారు బీరువాను డబ్బుతో నింపడానికే ఆసక్తి చూపిస్తున్నారు. వెస్టిండీస్ జట్టు టీ20 టోర్నమెంట్లను గెలుస్తుంది. అయితే అది క్రికెట్ కాదు' అని హోల్డింగ్ అన్నారు. ఐపీఎల్‌లో ఎందుకు కామెంటరీ చెప్పడం లేదన్న ప్రశ్నకు హోల్డింగ్ బదులిస్తూ.. తాను క్రికెట్‌కు మాత్రమే కామెంటరీ చెబుతానని స్పష్టం చేశాడు. ఐపీఎల్ అసలు క్రికెట్టే కాదని, అందుకే నేను కామెంటరీ చెప్పడంలేదని హోల్డింగ్ చెప్పకనే చెప్పాడు.

60 టెస్టులు, 102 వన్డేలు:
మైకెల్ హోల్డింగ్ ఇటీవలే జాత్యహంకార అంశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ తాను ఇంగ్లండ్‌లో పెరిగి ఉంటే.. అసలు బతికి ఉండేవాడినే కాదేమో అని పేర్కొన్నాడు. అదృష్టవశాత్తు తాను ఇంగ్లండ్‌లో పెరగలేదని.. లేదంటే యువకుడిగా ఉన్నప్పుడే మరణించేవాడినన్నాడు. 1979లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన 67 ఏళ్ల హోల్డింగ్ విండీస్ తరఫున 60 టెస్టులు, 102 వన్డేలు ఆడాడు. మొత్తంగా 391 వికెట్లు పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












