గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విల్ జాక్స్ తొలుత 16 బంతుల్లో 16 పరుగులు చేశాడు. సరిగ్గా చెప్పాలంటే అంతకంటే ముందు బంతికో పరుగు చొప్పున సాధించడానికి కూడా కష్టపడ్డాడు. ఆ తర్వాత అతను కుదురుకున్నాడు. 31 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. అనంతరం జాక్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయాడు.
గుజరాత్ బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడి ధాటికి మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ ఓవర్‌కు చెరో 29 పరుగుల చొప్పున పరుగులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన జాక్స్ 41 బంతుల్లో సెంచరీ బాదాడు. సెంచరీలో చివరి 50 పరుగులు సాధించడానికి కేవలం పది బంతులే తీసుకున్నాడు.

ఐపీఎల్‌లో 50 నుంచి 100 పరుగులను అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా విల్ జాక్స్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. హాఫె సెంచరీని సెంచరీగా మలచడానికి గేల్ 13 బంతులు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో వేగవంతమై సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో జాక్స్ అయిదో స్థానంలో నిలిచాడు.
ఈ జాబితాలో క్రిస్ గేల్ (30 బంతుల్లో) టాప్‌లో ఉన్నాడు. గేల్ తర్వాతి స్థానాల్లో యూసఫ్ పఠాన్ (37 బంతుల్లో), డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో), ట్రావిస్ హెడ్ (39 బంతుల్లో), జాక్స్ (41 బంతుల్లో) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ తొమ్మిది వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. విల్ జాక్స్‌కు తోడుగా విరాట్ కోహ్లి (70*; 44 బంతుల్లో, 6x4, 3x6) విధ్వంసం సృష్టించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (84*; 49 బంతుల్లో, 8x4, 4x6), షారుక్ ఖాన్ (58; 30 బంతుల్లో, 3x4, 5x6) అర్ధశతకాలు సాధించారు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ (1/23), మాక్స్‌వెల్ (1/28), సిరాజ్ (1/34) తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో బెంగళూరు ఒక్క వికెట్ కోల్పోయి 16 ఓవర్లలో విజయం సాధించింది.