కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన జట్టుకు అవసరమైన సమయంలో మరో విజయాన్నందించాడు. అరచేతికి గాయమైనా.. దాన్ని పట్టించుకోకుండా తన జట్టు విజయమే లక్ష్యంగా ఆడాడు.
51బంతుల్లో 75 పరుగులు చేశాడు కోహ్లీ. మరోసారి ఈ మ్యాచ్ లో ఏబి డివిలియర్స్ చెలరేగగా, క్రిస్ గేల్ ఫాంలోకి వచ్చి బౌండరీలు బాదాడు. దీంతో కోల్‌కతా కెప్టెన్ గంభీర్, మనీష్ పాండేలు చేసిన అర్థ శతకాలు వృథా అయ్యాయి.
మ్యాచ్ గెలుపు అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. 'చాలా పెద్ద గాయమే. నా అరచేయి ఇప్పుడు నొప్పిపెట్టడం ప్రారంభించింది. ఏడు లేదా ఎనిమిది కుట్లు పడతాయేమో. 10కుట్లు పడినా పరవాలేదు.. ఎందుకంటే మేం గెలిచాం' అని తన గాయాన్ని చూపుతూ సంతృప్తి వ్యక్తం చేశాడు.

'మైదానంలోకి అడుగుపెట్టిన సమయంలో అరచేయి గాయం కారణంగా సరిగా ఆడలేమోనని చాలా భయపడ్డా. ఏదైమైనా నేను బ్యాటింగ్ చేయాల్సిందేనని వైద్యుడికి చెప్పి మైదానంలోకి వచ్చాను' అని కోహ్లీ తెలిపాడు. ఏబి, తాను కోల్‌కతా బాగా ఆడినట్లు చెప్పాడు. తమ జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందన్నాడు. 'ఏదేమైనా విజయం దిశగా పయనిద్దాం' అని తాను చెప్పగా.. ఏబి అందుకు సన్నద్ధమయ్యాడని తెలిపాడు.
ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే..
ఐపీఎల్-9లో ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు సమష్టిగా రాణించి విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 184 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు.. కెప్టెన్ విరాట్ కోహ్లి (75 నాటౌట్: 51 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్ ఆడటంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
సీజన్‌లో తొలిసారి ఓపెనర్ క్రిస్‌గేల్ (49: 31 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) రెండంకెల స్కోరు నమోదు చేసి బెంగళూరుకు మెరుపు ఆరంభాన్నివ్వగా.. ఏబీ డివిలియర్స్ (59 నాటౌట్: 31 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) తన మార్కు షాట్లతో బౌండరీలు బాదేశాడు. కోహ్లి- డివిలియర్స్ జోడి రెండో వికెట్‌కి అజేయంగా 68 బంతుల్లోనే 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో బెంగళూరు 18.4 ఓవర్లలోనే 186/1తో గెలుపొందింది.
గంభీర్, మనీశ్ అర్ధశతకాలు వృథా
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టులో ఓపెనర్ రాబిన్ ఉతప్ప (2) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరినా.. కెప్టెన్ గౌతమ్ గంభీర్ (51: 34 బంతుల్లో 7ఫోర్లు), మనీశ్ పాండే (50: 35 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో చెలరేగారు. బెంగళూరు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడి వికెట్ల మధ్య ఒకటి, రెండు పరుగులు వేగంగా తీస్తూనే.. గతి తప్పిన బంతుల్ని బౌండరీకి తరలించేశారు.
ఈ క్రమంలోనే 32 బంతుల్లో గంభీర్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. సాఫీగా సాగిపోతున్న కోల్‌కతా ఇన్నింగ్స్ గంభీర్-మనీశ్ పాండే మధ్య సమన్వయ లోపం కారణంగా తడబాటుకు గురైంది. జట్టు స్కోరు 90 వద్ద గంభీర్ రనౌటవడంతో 76 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం 34 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుని జోరు మీద కనిపించిన మనీశ్ పాండే కూడా ఫీల్డర్ డివిలియర్స్ చేతికి చిక్కడంతో కోల్‌కతా ఇబ్బందుల్లో పడింది. ఫామ్‌లో ఉన్న హిట్టర్ యూసఫ్ పఠాన్ 6(12 బంతుల్లో)తో పాటు సూర్యకుమార్ యాదవ్ (5) కేవలం 7 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరిపోయారు. దీంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది.
కానీ, చివర్లో హిట్టర్ ఆండ్రీ రసెల్ (39 నాటౌట్: 19 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు), షకిబ్ అల్ హసన్ (18 నాటౌట్: 11 బంతుల్లో ఫోర్, సిక్స్) రాణించడంతో కోల్‌కతా 183 పరుగులు చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో శ్రీనాథ్ అరవింద్ 2 వికెట్లు తీయగా.. షేన్ వాట్సన్, చాహల్ చెరో వికెట్ తీశారు. కాగా, ఈ విజయంతో బెంగళూరు ఫ్లేఆఫ్ ఆశలను సజీవం చేసుకున్నట్లయింది.