బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో రాణించాలంటే సీనియర్స్‌కూ జూనియర్స్‌కూ మధ్య స్నేహం అత్యంత ముఖ్యమని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. సపోర్టు స్టాఫ్ సహాయంతో యువ, సీనియర్ ఆటగాళ్లు నిలకడగా ఆడడమే తమ జట్టు ఫలితాలు సాధించడానికి కారణమని ఆయన అన్నాడు.
ప్రముఖ ఐటి సర్వీసెస్, సోల్యూషన్స్ ప్రొవెడర్ కంపెనీ యుఎస్‌టి గ్లోబల్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కంపెనీయే చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన స్పాన్సర్. సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి, జూనియర్లకు అవకాశం ఇవ్వడం కష్టమైన పని అని, అయితే భారత్‌కు ప్రాతినిద్యం వహిస్తున్న యువ ఆటగాళ్లకు తాము ప్రాధాన్యం ఇస్తున్నా మని ధోనీ చెప్పాడు.
రవీంద్ర జడేజా యువకుడేనని, తమకు ఈశ్వర్ పాండే ఉన్నాడని, భారత్‌కు ఆడుతున్న మోహిత్ శర్మ కూడా ఉన్నాడని ఆయన చెప్పారు తమకు పవన్ నేగీ కూడా ఉన్నట్లు తెలిపాడు. తమకు మంచి యువ ఆటగాళ్లు ఉన్నారని, అయితే వారి కోసం బ్రెండన్ మెక్‌కుల్లం వంటి సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టలేమని ధోనీ సమర్థించుకున్నాడు.

సురేష్ రైనా, మైక్ హస్సీ వంటి సీనియర్లు ఉండడం యువ ఆటగాళ్లకు చాలా ఉపయోగపడుతుందని, వారి నుంచి యువ ఆటగాళ్లు చిట్కాలు నేర్చుకోవచ్చునని ధోనీ అన్నాడు.
తన కూతురు జీవా గురించి ప్రస్తావిస్తూ సుదీర్ఘమైన ఆస్ట్రేలియా పర్యటనలో తాను ఆమెను మిస్సయినట్లు చెప్పాడు. జీవా పుట్టినప్పుడు తాను భారత్‌లో లేనని, వెంటనే చూడలేకపోయానని, అది చాలా కష్టమైన సమయమని ఆయన అన్నాడు.
పిల్లల పుట్టుకతో మనిషిలో మార్పు వస్తుందని చెప్పాడు. బేబీ నవ్వు నీ జీవితంలో ఎంతో మార్పును తెస్తుందని అన్నాడు. తాను భారత్ తరఫున ఆడుతున్నానా, లేదంటే మంచి ఫ్రాంచైజ్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నానా అనే విషయాన్ని జీవా పట్టించుకోదని ధోనీ అన్నాడు. తాను ఏడ్వాలనుకుంటే ఏడ్చేస్తుందని, అది మంచి భావనను అందిస్తుందని అన్నాడు.