అహ్మదాబాద్: షేన్ వాట్సన్, అజింక్యా రహానేలు రెచ్చిపోయి ఆడటంతో ఆదివారం నాడు రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ పైన ఎనిమిది వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. అంతకుముందు ముంబై ఇండియన్స్‌ను చెన్నై ఆడుకుంటే.. చెన్నైని ఇప్పుడు రాజస్థాన్ ఆడుకుంది. చెన్నై తమ ముందు ఉంచిన 157 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండే వికెట్లు కోల్పోయి రాజస్థాన్ చేధించింది.
ఓపెనర్లు ఆజింక్య రహానే, షేన్ వాట్సన్ అర్ధ శతకాలతో రాణించడంతో 157 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఛేదించింది. టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్‌ను ఎంచుకొని 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 156 పరుగులు చేసింది.
జట్టు స్కోరు 15 పరుగుల వద్ద ప్రవీణ్ తంబే బౌలింగ్‌లో జేమ్స్ ఫాల్క్‌నెర్ క్యాచ్ అందుకోగా బ్రెండన్ మెక్‌కలమ్ (12) అవుటయ్యాడు. రైనా (4), ఫఫ్ డు ప్లెసిస్ (1) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక పెవిలియన్ చేరారు. ఓపెనర్ డ్వెయిన్ స్మిత్ (29 బంతుల్లో 40 పరుగులు) చేసి ఫాల్క్‌నెర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

65 పరుగులకు నాలుగు వికట్లు పడిపోయాయి. ఆ తర్వాత డ్వెయిన్ బ్రేవో, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో వికెట్ కూలకుండా 20 ఓవర్ల కోటాను పూర్తి చేశారు. బ్రేవో 36 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 62, ధోనీ 37 బంతుల్లో, నాలుగు ఫోర్లతో 31 చొప్పున పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. రాజస్థాన్ బౌలర్లలో అంకిత్ శర్మ, క్రిస్ మోరిస్, ప్రవీణ్ తంబే తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఫేవరిట్ ముద్ర వేయించుకున్న చెన్నైని ఓడించి, వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేయడానికి 157 పరుగులు చేయాల్సి ఉండగా.. రాజస్థాన్ ఓపెనర్లు రహానే, కెప్టెన్ వాట్సన్ వ్యూహాత్మకంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
16.1 ఓవర్లలో మొదటి వికెట్‌కు 144 పరుగులు జోడించిన తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వాట్సన్ బౌల్డ్ అయ్యాడు. అతను 47 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. ఈ స్కోరులో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. గత మ్యాచ్‌ల్లో వాట్సన్ స్థానంలో జట్టుకు నాయకత్వం వహించిన స్టీవెన్ స్మిత్ 6 పరుగులు చేసి, డ్వెయిన్ బ్రేవో బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అప్పటికి జట్టు స్కోరు సమంకాగా, కరుణ్ నాయర్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఒక పరుగు చేయడంతో రాజస్థాన్ లక్ష్యాన్ని చేరింది. 18.2 ఓవర్లలో మ్యాచ్‌ని పూర్తి చేసే సమయానికి రహానే 76 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
రహానే 55 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ మొదటి నుంచి చివరి వరకూ ఏ దశలోనూ చెన్నై గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. డ్వెయిన్ బ్రేవో వేగంగా 62 పరుగులు చేయకపోతే, ఆ జట్టు పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది.