బెంగళూరు: ఐపీఎల్ 8లో భాగంగా బుధవారం నాడు రాజస్థాన్ రాయల్స్ - బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ చిన్నోడు (అతిపిన్న వయస్కుడు) సర్ఫరాజ్ ఖాన్ ఆకట్టుకున్నాడు. తద్వారా భవిష్యత్తు భారత క్రికెట్ జట్టు రేసులో తాను ఉన్నానని చూపించాడు.
బుధవారం నాటి మ్యాచ్‌లో సర్ఫరాజ్ 21 బంతుల్లో 45 పరుగులు (నాటౌట్) చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు అందరి దృష్టిని ఆకర్షించాడు. షేన్ వాట్సన్, ఫాల్కనర్ వంటి దిగ్గజ రాజస్థాన్ ఆటగాళ్ల బౌలింగులోని అదరగొట్టాడు. డివిల్లియర్స్ రనౌట్ అయ్యాక బెంగళూరు అభిమానులు నిరుత్సాహపడ్డారు.
అయితే, సర్ఫరాజ్.. డివిల్లియర్స్‌ను మరిపించి, అభిమానులను మురిపించాడు. తన బ్యాటింగ్ విన్యాసాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ స్వయంగా సర్ఫరాజ్‌కు సరదాగా దండం పెట్టడం గమనార్హం. ఇన్నింగ్స్ అనంతరం ప్రేక్షకులు కూడా నీరాజనం పలికారు. చప్పట్లు కొట్టారు.

అయితే, వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దై రాజస్థాన్, బెంగళూరులు చెరో పాయింట్ పంచుకున్నాయి. సర్ఫరాజ్ మాత్రం అందర్నీ ఆకట్టుకున్నాడు.
సర్ఫరాజ్‌కు ఇది రెండో ఐపీఎల్ మ్యాచ్ మాత్రమే. ఏ బౌలర్‌ను అతను లెక్క చేయలేదు. ఐసీసీ ప్రపంచ కప్ అందుకున్న ఆస్ట్రేలియా జట్టులోని బౌలర్లు రాజస్థాన్‌లో ఉన్నారు. అయినప్పటికీ.. అతను ఎక్కడా తగ్గలేదు. మంచి ఫుట్ వర్క్‌తో బ్యాట్ ఝులిపించాడు. ఏ మాత్రం తొణకడం, నిర్భయం కనిపించలేదు.
ప్రతి బంతిని బౌండరీకి తరలిద్దామన్న కసి కనిపించింది. నిన్న, బిన్నీ బౌలింగులో సింగిల్ తీయడం ద్వారా ఖాతా తెరిచిన సర్ఫరాజ్, ఆ తర్వాత ఎవరినీ లెక్క చేయలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతి చిన్న వయస్కుడు సర్ఫరాజ్. ఇదే రీతిలో అతను కొనసాగితే టీమిండియాకు ఆశాకిరణంగా కనిపిస్తాడని చెప్పవచ్చు. నిన్నటి మ్యాచులో అతడు కొద్దిసేపే క్రీజులో ఉన్నప్పటికీ.. ఆడిన తీరు అలరించింది.

కాగా, మాజీ క్రికెటర్ల నుంచి వ్యాఖ్యాతల వరకు అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. అతన్ని ఒక్కొక్కరు ఒక్కో తీరులో కొనియాడారు. ఒకరు పాకిస్తాన్ వెటరన్ జావెద్ మియాందాద్‌తో పోలిస్తే, మరొకరు శ్రీలంక వెటరన్ రణతుంగతో, ఇంకొకరు అరవింద డిసిల్వాతో పోల్చారు.
వారం రోజుల క్రితం ఐపీఎల్లో అడుగు పెట్టిన అతి చిన్న వయస్కుడిగా (17 ఏళ్ల 177 రోజులు) సర్ఫరాజ్ రికార్డు దక్కించుకున్నాడు. 2009లో ప్రసిద్ధమైన ముంబై స్కూల్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో 439 పరుగులతో సరికొత్త రికార్డు సృష్టించాడు. దాంతోనే అతను వెలుగులోకి వచ్చాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ 8లో ఆరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ వయస్సు 17 ఏళ్ల 177 రోజులు. సర్ఫరాజ్ ఖాన్ రైట్ హ్యాండెడ్ బ్యాట్సుమెన్. గతంలో ప్రదీప్ సంగ్వాన్ పేర ఈ రికార్డ్ ఉండేది. అతడు 17 ఏళ్ల 179 రోజులు ఉన్నప్పుడు 2008లో ఐపీఎల్ ఆడాడు. దానిని సర్ఫరాజ్ బ్రేక్ చేశాడు. ఇతనిని బెంగళూరు రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది.