సీజన్ ముగియకముందే కెప్టెన్లపై వేటు?
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతుండగానే వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ 2027 కెప్టెన్సీ మార్పులపై అప్పుడే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్లు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనాన్ని రేపుతున్నాయి. రాబోయే సీజన్ నాటికి లీగ్‌లోని నలుగురు కెప్టెన్లు తమ కెప్టెన్సీని కోల్పోయే అవకాశం ఉందని వీరిద్దరూ అంచనా వేయడం విశేషం.
హర్ష్ గోయెంకా ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఐపీఎల్ 2027 నాటికి నలుగురు కెప్టెన్ల మార్పు ఖాయమని జోస్యం చెప్పారు. అంతేకాకుండా ఈ సీజన్ ముగియకముందే కనీసం ఇద్దరు కెప్టెన్లు తమ బాధ్యతల నుంచి తప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన నేరుగా ఎవరి పేర్లను వెల్లడించనప్పటికీ.. ప్రస్తుతం జట్ల ప్రదర్శనను బట్టి హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్), రిషబ్ పంత్(లక్నో సూపర్ జెయింట్స్), అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్), అజింక్య రహానే (కోల్‌కతా నైట్ రైడర్స్) వంటి వారిపై వేటు పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ చర్చలోకి ఎంట్రీ ఇచ్చిన లలిత్ మోదీ.. హర్ష్ గోయెంకా జోస్యానికి మరింత బలాన్ని చేకూర్చారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తమ నాయకత్వ శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై మొదటి నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో, ముంబై ఫ్రాంచైజీ త్వరలోనే కొత్త సారథిని వెతకవచ్చని ఆయన సంకేతాలిచ్చారు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుందని.. రిషబ్ పంత్ నాయకత్వంపై ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకాకు పూర్తి నమ్మకం ఉందని ఆయన వెల్లడించారు.
ఐపీఎల్ 2027కి ముందు మెగా వేలం జరగనుండటంతో ఫ్రాంచైజీలు తమ దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వ్యూహాలు రచిస్తున్నాయి. వరుస ఓటములు, పేలవమైన నిర్ణయాల కారణంగా యువ కెప్టెన్ల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. హర్ష్ గోయెంకా, లలిత్ మోదీ వంటి దిగ్గజాలు చేసిన ఈ కామెంట్స్ కేవలం ఊహాగానాలేనా లేక అంతర్గత సమాచారమా అన్నది తేలాల్సి ఉన్నా, ఈ వార్తలు మాత్రం ఐపీఎల్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను పెంచుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications