భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న తరుణంలో బంగ్లా స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ 2026లో పాల్గొనడంపై సందిగ్దత నెలకొంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో బీసీసీఐ ఈ విషయంపై స్పందించింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లపై నిషేధం విధించే విషయంపై బీసీసీఐ ప్రస్తుతం వేచి చూసే ధోరణిని అవలంభిస్తోంది.
కేకేఆర్ కొనుగోలు.. సోషల్ మీడియాలో నిరసనలు
ఇటీవల జరిగిన మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బంగ్లాదేశ్ ఆటగాడిగా ముస్తాఫిజుర్ నిలిచాడు. అయితే బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అతడిని తీసుకోవడంపై సోషల్ మీడియాలో కేకేఆర్ యాజమాన్యం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. రాజకీయ నాయకులు కూడా బంగ్లా ఆటగాళ్లను ఐపీఎల్‌లోకి రానివ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు.

బీసీసీఐ స్టాండ్ ఏంటి?
ఈ వివాదంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ.. "పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. మేం నిరంతరం భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు మేం బంగ్లా ఆటగాళ్లపై ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేం. బంగ్లాదేశ్ శత్రు దేశం కాదు, కాబట్టి ప్రస్తుతం ముస్తాఫిజుర్ ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపుతున్నాం" అని పేర్కొన్నారు.
వీసా, ఎన్‌ఓసీ (NOC) సమస్యలు
ముస్తాఫిజుర్ ఐపీఎల్ ఆడటం అనేది కేవలం బీసీసీఐ నిర్ణయంపైనే కాకుండా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుఇచ్చే ఎన్వోసీపై కూడా ఆధారపడి ఉంటుంది. ఏప్రిల్‌లో బంగ్లాదేశ్ జట్టు న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడాల్సి ఉంది. ఒకవేళ బీసీబీ అతనికి ఎన్‌ఓసీ నిరాకరిస్తే అతను ఐపీఎల్‌కు దూరమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత్ వచ్చే బంగ్లాదేశ్ జట్టు వీసా గడువును పెంచడం ద్వారా ముస్తాఫిజుర్ ఐపీఎల్ ఆడేలా బీసీసీఐ విదేశీ వ్యవహారాల శాఖతో చర్చిస్తోంది.