IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. సీఎస్కే యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే బ్యాట్ విషయంలో స్టేడియంలో కాసేపు డ్రామా నడిచింది. అంపైర్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఆయుష్ మాత్రే బ్యాట్ టెస్టులో ఫెయిల్ అవ్వడం.. ఆ తర్వాత క్లియర్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రతి బ్యాటర్ క్రీజులోకి రాగానే తన బ్యాట్‌ను అంపైర్‌కు చూపించి 'గేజ్ టెస్ట్' చేయించుకోవాలి. బ్యాట్ వెడల్పు, మందం నిబంధనలకు లోబడి ఉంటేనే అంపైర్ అనుమతిస్తారు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే క్రీజులోకి రాగానే ఈ పరీక్ష మొదలైంది.
ముందు ఫెయిల్.. ఆపై పాస్!
ఆయుష్ మాత్రమే తన బ్యాట్ ను ఇవ్వగా.. అంపైర్ దానిని గేజ్ పరికరంలో పెట్టి చూశారు. అది సరిగ్గా లోపలికి వెళ్లకపోవడంతో బ్యాట్ రిజెక్ట్ అయింది. వెంటనే ఆయుష్ మాత్రే మరొక బ్యాట్ తెప్పించుకున్నాడు. విచిత్రమేమిటంటే.. రెండో బ్యాట్ కూడా గేజ్ టెస్టులో ఫెయిల్ అయింది. దీంతో ఆయుష్ మాత్రే కాస్త అయోమయానికి గురయ్యాడు. అయితే కాసేపటి తర్వాత అంపైర్‌కు తన పొరపాటు తెలిసింది. ఆయన గేజ్ పరికరాన్ని రివర్స్‌లో పట్టుకున్నానని గ్రహించి దాన్ని తిప్పి చూడగా.. రెండు బ్యాట్లు సులభంగా గేజ్ లోపలికి వెళ్లాయి. అంపైర్ తన తప్పును తెలుసుకుని నవ్వగా.. కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఇయాన్ బిషప్, మైఖేల్ క్లార్క్ కూడా ఈ ఘటనను చూసి నవ్వు ఆపుకోలేకపోయారు.

విస్ఫోటన బ్యాటింగ్.. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!
బ్యాట్ టెస్టులో గందరగోళం జరిగినప్పటికీ.. ఆయుష్ మాత్రే తన ఏకాగ్రతను కోల్పోలేదు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. మార్కస్ స్టోయినిస్ వేసిన బంతిని సిక్సర్ బాది 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.మొత్తం మీద 43 బంతుల్లో 73 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి వైశాఖ్ విజయ్‌కుమార్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
రుతురాజ్ గైక్వాడ్‌తో కీలక భాగస్వామ్యం
ఓపెనర్ సంజు శాంసన్ రెండో ఓవర్‌లోనే అవుట్ కావడంతో కష్టాల్లో పడ్డ సీఎస్కేను కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 55 బంతుల్లో 96 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ 96 పరుగుల్లో ఆయుష్ మాత్రే వాటానే 67 పరుగులు ఉండటం విశేషం. రుతురాజ్ గైక్వాడ్ (22 పరుగులు) కేవలం సపోర్టింగ్ రోల్ పోషించగా.. ఆయుష్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.