IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ కౌంట్ డౌన్ కొనసాగుతున్న వేళ క్రికెట్ ప్రపంచంలో అభిమానులును ఓ ప్రశ్న వెంటాడుతోంది. అదే 'ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజనా?' అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది. 44 ఏళ్ల వయస్సులో తన 19వ ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్‌పై గత కొన్నాళ్లుగా ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
గంగూలీ 'నో కామెంట్స్'.. అసలు సంగతి ఇదే!
ధోనీ భవిష్యత్తు గురించి మీడియా ప్రతినిధులు సౌరవ్ గంగూలీని ప్రశ్నించగా.. ఆయన చాలా వ్యూహాత్మకంగా సమాధానమిచ్చాడు. "ధోనీ ఏం చేయాలో నేను ధోనీకే చెబుతాను కానీ మీడియాకు కాదు' అంటూ గంగూలీ స్పష్టం చేశారు. దీనిపై తానే స్వయంగా ఎంఎస్ ధోనీతో పర్సనల్‌గా మాట్లాడతానని దాదా సంకేతాలిచ్చాడు. దీంతో ధోనీ రిటైర్మెంట్ ప్లాన్ పై గంగూలీకి ముందే తెలుసా.. అనే చర్చ మొదలైంది.

ఆకాష్ చోప్రా సెన్సేషనల్ కామెంట్స్
ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా మాత్రం ఈ సీజనే ధోనీకి ఆఖరిదని బలంగా నమ్ముతున్నాడు. దీనికి ప్రధాన కారణం సంజూ శాంసన్ సీఎస్కేలోకి రావడం. సీఎస్కే రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను ఇచ్చి రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్‌ను రూ.18 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సంజూ శాంసన్ ఇప్పుడు ధోనీ వారసుడిగా సిద్ధంగా ఉన్నాడని.. వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా సంజూనే తీసుకునే అవకాశం ఉందని ఆకాష్ చోప్రా విశ్లేషించాడు. ఎంఎస్ ధోనీ కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రమే కనిపిస్తే.. ఇదే ఆయనకు వీడ్కోలు పలకడానికి సరైన సమయమని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.
సీఎస్కేలో కొత్త శకం.. రుతురాజ్ గైక్వాడ్ చేతిలోకి పగ్గాలు
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి స్థాయిలో రుతురాజ్ గైక్వాడ్ టీంగా మారిపోయింది. జట్టు యాజమాన్యం కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయుష్ మాత్రే, ప్రశాంత్ వీర్ వంటి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. ఇటీవల జరిగిన 'ROAR 26' ఈవెంట్‌లో ధోనీ స్వయంగా సంజు శాంసన్, శివమ్ దూబేలను గౌరవించడం చూస్తుంటే.. నాయకత్వ బాధ్యతలను తన వారసులకు అప్పగించే ప్రక్రియ మొదలైందని స్పష్టమవుతోంది. ఎంఎస్ ధోనీ ఈ సీజన్ లో మెంటర్-కమ్-ప్లేయర్ పాత్రలో కనిపిస్తారా? లేదా తనదైన శైలిలో హెలికాప్టర్ షాట్లతో కెరీర్‌ను ఘనంగా ముగిస్తారా? అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.