ఆ నమ్మకమే నన్ను ఆడించింది: సాయి సుదర్శన్ భావోద్వేగం
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన 34వ లీగ్ మ్యాచ్‌లో యువ సంచలనం సాయి సుదర్శన్ శివతాండవం చేశాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది చివరి హోమ్ మ్యాచ్ కావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సాయి సుదర్శన్ ఈ సీజన్‌లో తన మొదటి శతకాన్ని నమోదు చేశాడు. ఐపీఎల్ 2026లో నమోదైన 6వ సెంచరీ ఇది కావడం విశేషం.
చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్
ఈ ఇన్నింగ్స్ ద్వారా సాయి సుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేవలం 47 ఇన్నింగ్స్‌ల్లోనే ఆయన ఈ మైలురాయిని చేరుకుని, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (48 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. గతేడాది ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచిన సాయి సుదర్శన్.. ఈ మ్యాచ్‌లో 57 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 128 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ 24 బంతుల్లో 32 పరుగులు చేసి ఔట్ అయినప్పటికీ.. సాయి సుదర్శన్ మాత్రం తగ్గలేదు. తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపడి సరిగ్గా 100 పరుగుల వద్ద జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం జోస్ బట్లర్ (16 బంతుల్లో 25) వేగంగా ఆడటంతో గుజరాత్ పటిష్ట స్థితికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
సంతోషం వ్యక్తం చేసిన సాయి సుదర్శన్
గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ తన ఫామ్‌ను మళ్లీ వెతుక్కున్నాడు. ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో కళ్లు చెదిరే సెంచరీతో చెలరేగి, జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆరంభాలు లభిస్తున్నప్పటికీ, వాటిని పెద్ద ఇన్నింగ్స్‌లుగా మార్చలేకపోయిన సాయి సుదర్శన్.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆ కరవును తీర్చాడు. సెంచరీ అనంతరం సాయి సుదర్శన్ మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు.
భావోద్వేగ శతకం
తన కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడంపై సాయి సుదర్శన్ స్పందిస్తూ.. "మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. వికెట్ స్వభావాన్ని మేము త్వరగానే అర్థం చేసుకున్నాం. పిచ్ ప్రారంభంలో కాస్త నెమ్మదిగా ఉంది. అందుకే పవర్ ప్లేను సమర్థవంతంగా వాడుకుంటూనే, ఇన్నింగ్స్‌ను లోతుగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. అది మాకు బాగా కలిసి వచ్చింది. ఈ సెంచరీ నా వ్యక్తిగత రికార్డు కంటే జట్టు ప్రయోజనాల కోసమే ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. డ్రెస్సింగ్ రూమ్‌లో నాపై నమ్మకం ఉంచిన వారికి ఈ ఇన్నింగ్స్‌ను అంకితం ఇస్తున్నాను. నేను నాపై పెట్టుకున్న ఉన్నత ప్రమాణాల దృష్ట్యా, గత కొన్ని మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాను. కానీ ఈరోజు జట్టును పటిష్ట స్థితిలో ఉంచినందుకు చాలా గర్వంగా ఉంది" అని సాయి సుదర్శన్ భావోద్వేగానికి గురయ్యాడు.
ఈ ఇన్నింగ్స్‌లో గతానికి భిన్నంగా ఏం చేశావన్న ప్రశ్నకు స్పందిస్తూ.. "నేను ఈసారి ఇన్నింగ్స్‌ను నా నియంత్రణలోకి తీసుకోవాలని అనుకోలేదు. కేవలం సహజంగా సాగిపోనిచ్చాను. మనం ఎంతగా ఒత్తిడిని వదిలేస్తామో.. అంతగా ప్రస్తుత క్షణంలో ఉండి అత్యుత్తమ ప్రదర్శన చేయగలమని అర్థమైంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో నేను మానసిక ఒత్తిడికి లోనయ్యాను, కానీ ఈరోజు ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాను" అని తన విజయ రహస్యాన్ని పంచుకున్నాడు. చిన్నస్వామి వికెట్‌పై షాట్లు ఆడటం అంత సులభం కాదని సాయి అభిప్రాయపడ్డాడు. బౌలర్లు పొరపాట్లు చేస్తేనే బ్యాటర్లకు పరుగులు వస్తాయని, ఈ వికెట్‌పై తాము సాధించిన స్కోరు తమ బౌలింగ్ విభాగానికి సరిపోతుందని ధీమా వ్యక్తం చేశాడు.
విరాట్ కోహ్లీపై ప్రశంసలు
తానూ విరాట్ కోహ్లీకి వీరాభిమానిని అని సాయి సుదర్శన్ ఈ సందర్భంగా బహిరంగంగా ప్రకటించాడు. "నా ఆరాధ్య దైవం ఎప్పుడూ విరాట్ కోహ్లీనే. ఆయనను చూస్తూనే నేను క్రికెట్ నేర్చుకున్నాను. అలాంటిది నా ఐడల్ ముందే, ఆయన ఆడుతున్న మైదానంలోనే ఇలాంటి ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇది నాకు చాలా స్పెషల్" అని సాయి సుదర్శన్ భావోద్వేగానికి లోనయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications