IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందే వివాదాలు మొదలయ్యాయి. మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఈ ప్రారంభ మ్యాచ్ టికెట్ల బుకింగ్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే ముగిసిపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు టికెట్ల బుకింగ్ ప్రారంభం కాగా.. కేవలం కొన్ని నిమిషాల్లోనే 'సోల్డ్ అవుట్' బోర్డులు కనిపించడంతో వేలాది మంది అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో టికెటింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదని, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టికెట్ల ధరలు.. స్టేడియం నేపథ్యం
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం టికెట్ ధరలను నిర్వాహకులు భారీగానే నిర్ణయించారు. సామాన్య అభిమానుల కోసం కనీస ధర రూ.3.750 ఉండగా.. లగ్జరీ సీట్ల ధర రూ.47,000 వరకు ఉంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియం గతేడాది జూన్‌లో జరిగిన ఓ విషాద ఘటనకు సాక్షిగా నిలిచింది. అప్పట్లో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తర్వాత స్టేడియంలో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌లను నిలిపివేయగా.. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌తో పునఃప్రారంభం కాబోతోంది. మృతి చెందిన ఆ 11 మంది గుర్తుగా ఆర్సీబీ యాజమాన్యం ప్రతి హోమ్ మ్యాచ్‌లో 11 సీట్లను రిజర్వ్ చేయాలని నిర్ణయించడం విశేషం.

అవకతవకలపై ఫ్యాన్స్ ఫైర్
టికెట్లు బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభిమానులు.. బుకింగ్ పోర్టల్ తెరిచిన మొదటి నిమిషంలోనే టికెట్లు అయిపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు తమ ఆవేదనను పంచుకుంటున్నారు. చాలా మంది వినియోగదారులు 4:01 గంటలకే వెబ్‌సైట్ క్రాష్ అవ్వడం లేదా సీట్లు అందుబాటులో లేవని చూపించడం పట్ల మండిపడుతున్నారు. కొందరు ఫ్యాన్స్ పేమెంట్ విండో వరకు వెళ్లినప్పటికీ.. పేమెంట్ పూర్తి కాకముందే టికెట్స్ అయిపోయాయని మెసేజ్ రావడంపై అభిమానులు మండిపడుతున్నారు.
బ్లాక్ మార్కెటింగ్ అంటూ ఫైర్
సాధారణ ప్రజలకు టికెట్లు దొరకకపోవడానికి ప్రధాన కారణం బ్లాక్ మార్కెటింగ్ అని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. టికెట్లను భారీ ధరలకు బయట అమ్ముకోవడానికి ముందే పక్కన పెట్టారని.. లేదా ఎక్కువ శాతం టికెట్లను వీవీఐపీలు, స్పాన్సర్లకు కేటాయించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 40 వేల సీట్ల సామర్థ్యం ఉన్న స్టేడియంలో కేవలం కొన్ని వందల టికెట్లు మాత్రమే సామాన్యులకు అందుబాటులో ఉంచారా అనే సందేహాలను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఈ ఆరోపణలపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కానీ.. అధికారిక టికెటింగ్ పార్టనర్లు కానీ స్పందించలేదు.
కొత్త నిబంధనలు.. భారీ మార్పులు
ఈ వివాదాల మధ్య ఐపీఎల్ 2026 కొత్త హంగులతో సిద్ధమవుతోంది. స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశారు.య అలాగే ఆటలో ఆసక్తిని పెంచేందుకు 10 ఓవర్ల తర్వాత కొత్త బంతిని ప్రవేశపెట్టే నియమాన్ని కూడా తీసుకువచ్చారు. మరోవైపు ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఆర్సీబీ జట్టును రూ.16,706 కోట్లకు కొత్త యాజమాన్యం కొనుగోలు చేయడం లీగ్‌లో ఉన్న క్రేజ్‌ను చాటిచెబుతోంది.