IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్‌ను మార్చాలనే చర్చలు జరిగాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట కారణంగా అక్కడ కీలక ఈవెంట్లను నిర్వహించేందుకు అనుమతి లభించడం లేదు. అయితే కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
చిన్నస్వామి స్టేడియంలోనే ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ మ్యాచ్‌లు
ఐపీఎల్ 2025 టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకుంది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన తర్వాత విజయోత్సవ వేడుకలను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్టేడియం భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. దీని ఫలితంగా బెంగళూరులో జరగాల్సిన 2025 మహిళల ప్రపంచ కప్ మ్యాచ్‌లను కూడా ఇతర వేదికలకు మార్చారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026కు ముందు ఆర్సీబీ మ్యాచ్‌లను కూడా తరలించవచ్చనే ఊహాగానాలు వినిపించాయి.

కర్ణాటక ఉపముఖ్యమంత్రి ఏమన్నారంటే?
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఐపీఎల్ మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియం నుంచి మరెక్కడికీ మార్చబోమని స్పష్టం చేశారు. డీకే శివకుమార్ మాట్లాడుతూ, "ఇది బెంగళూరు, కర్ణాటక గౌరవానికి సంబంధించిన విషయం. ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్కడే జరిగేలా చూస్తాం" అని అన్నారు. డీకే శివకుమార్ ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు. "చిన్నస్వామి స్టేడియం నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను మరెక్కడికీ మార్చడానికి మేము అనుమతించం. ఇది బెంగళూరు, కర్ణాటక గౌరవానికి సంబంధించిన ప్రశ్న. ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్కడే జరిగేలా మేము ఖచ్చితంగా చూస్తాం. నేను క్రికెట్ అభిమానిని. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా, స్టేడియం గౌరవం చెక్కుచెదరకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడేలా మేము కొత్త క్రికెట్ స్టేడియాన్ని కూడా నిర్మిస్తాం." అని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
ఇప్పటికే కోల్పోయిన ఈవెంట్లు
2025 మహిళల వన్డే ప్రపంచ కప్‌లో 5 మ్యాచ్‌లు ఇక్కడ జరగాల్సి ఉండగా.. జూన్ 4న జరిగిన తొక్కిసలాట తర్వాత కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) పోలీసుల నుంచి అవసరమైన అనుమతిని పొందలేకపోయింది. దీనికి ముందు ఆగస్టులో మహారాజా టీ20 టోర్నమెంట్‌ను నిర్వహించే హక్కును కూడా ఈ స్టేడియం కోల్పోయింది. అంతేకాకుండా, 2026లో జరగబోయే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) మ్యాచ్‌లు కూడా చిన్నస్వామి స్టేడియంలో జరగవు. WPL మ్యాచ్‌లు నవీ ముంబైలోని డాక్టర్ డి.వై. పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ, వడోదరలోని కోటంబ్ స్టేడియంలో నిర్వహించబడతాయి.