IPL 2026: ఐపీఎల్ 2026 కోసం ఆటగాళ్లను రిటైన్ చేసుకునే గడువుకు ముందే ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అద్భుతమైన ట్రేడ్ డీల్స్ తో సందడి మొదలుపెట్టింది. వేర్వేరు జట్లతో రెండు ట్రేడ్ ఒప్పందాలను ఖరారు చేసుకోవడం ద్వారా ఇద్దరు మాజీ ఆటగాళ్లను తిరిగి తమ శిబిరంలోకి తీసుకుంది.
తిరిగొచ్చిన లార్డ్
ముంబై ఇండియన్స్ ప్రకటించిన మొదటి డీల్‌లో క్రికెట్ ఫ్యాన్స్ లార్డ్‌గా పిలుచుకునే భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడ్ ద్వారా కొనుగోలు చేసింది. 2025 వేలంలో అమ్ముడుపోని శార్దూల్‌ను గాయపడిన మొహ్సిన్ ఖాన్ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ.2 కోట్లకు సంతకం చేసుకుంది. గత సీజన్‌లో 10 మ్యాచ్‌లలో 13 వికెట్లు తీసిన శార్దూల్ ఇప్పుడు తన సొంత జట్టు ముంబైకి తిరిగి వచ్చాడు. ఈ డీల్ షరతులు ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఈ ట్రేడ్‌లో భాగంగా అర్జున్ టెండూల్కర్‌ను లక్నోకు ఇచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపించాయి. ఐపీఎల్‌లో 105 మ్యాచ్‌లలో 107 వికెట్లు, 325 పరుగులు చేసిన శార్దూల్ రాకతో ముంబై ఇండియన్స్‌కు లోయర్ ఆర్డర్‌లో బలం పెరుగుతుంది.

రూథర్‌ఫోర్డ్ రెండో విదేశీ ట్రేడ్
శార్దూల్ ఠాకూర్ ట్రేడింగ్‌ను ధ్రువీకరించిన కొద్ది నిమిషాలకే ముంబై ఇండియన్స్ తమ రెండో డీల్‌ను ప్రకటించింది. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ షెర్పేన్ రూథర్‌ఫోర్డ్‌ను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ ద్వారా దక్కించుకుంది. రూథర్‌ఫోర్డ్ గుజరాత్ టైటాన్స్‌కు రూ.2.6 కోట్లకు అమ్ముడయ్యాడు. అదే ధరతో ముంబై ఇండియన్స్‌కు మారనున్నాడు. 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున 13 మ్యాచ్‌లలో 291 పరుగులు చేశాడు.
షెర్పేన్ రూథర్‌ఫోర్డ్ 2020లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ముంబె ఇండియన్స్‌కు ట్రేడ్ అయ్యాడు. ఈ ట్రేడ్ ద్వారా రూథర్‌ఫోర్డ్ ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు ట్రేడ్ చేయబడిన మొదటి విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఆశిష్ నెహ్రా మాత్రమే ఈ ఘనత సాధించాడు. రూథర్‌ఫోర్డ్ 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచినప్పుడు, 2024లో KKR టైటిల్ గెలిచినప్పుడు కూడా జట్టులో ఉన్నాడు, కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ రెండు డీల్స్‌తో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 వేలానికి ముందే తమ జట్టును పటిష్టం చేసుకునే ప్రయత్నం చేస్తోంది.