IPL 2026: రిటైర్మెంట్‌పై మిచెల్ స్టార్క్ సంచలన ప్రకటన!
IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. సుదీర్ఘ విరామం, గాయాల తర్వాత ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ స్టేడియంలో అడుగుపెట్టాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ తన రీ-ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. రాజస్థాన్ బ్యాటర్లను వణికించి 3 కీలక వికెట్లు పడగొట్టి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.అయితే మ్యాచ్ సమయంలో స్టార్క్ బౌలింగ్ చేతికి భారీగా కట్లు ఉండటం చూసి అతని ఫిట్ నెస్ ఇంకా పూర్తిస్థాయిలో లేదని.. త్వరలోనే ఆయన ఆటకు స్వస్తి పలుకుతాడని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
రిటైర్మెంట్ ఆలోచన లేదు.. స్టార్క్ స్పష్టత
ఈ పుకార్లకు మిచెల్ స్టార్క్ మ్యాచ్ అనంతరం ముగింపు పలికాడు. తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. "ప్రస్తుతానికి నాకు అలాంటి ఆలోచనే లేదు. చేతికి కట్లు ఉండటం చూసి రిటైర్మెంట్ గురించి మాట్లాడటం కాస్త వింతగా ఉంది. నేను ఇంకా ఆ దశకు చేరుకోలేదని భావిస్తున్నాను" అని మిచెల్ స్టార్క్ స్పష్టం చేశాడు. గత కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉండి.. కేవలం ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపైనే దృష్టి సారించానని, ఇప్పుడు మైదానంలోకి తిరిగి రావడం తనలో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని స్టార్క్ కుండబద్దలు కొట్టాడు. 35 ఏళ్ల వయసులో కూడా తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని ఈ సందర్భంగా స్టార్క్ చాటిచెప్పాడు.

తొలి ఓవర్‌లోనే వికెట్.. జైస్వాల్‌కు షాక్
రాజస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభమైన మొదటి ఓవర్‌లోనే మిచెల్ స్టార్క్ తన సత్తా ఏంటో చూపించాడు. యువ సంచలనం యశస్వి జైస్వాల్ మొదటి రెండు బంతుల్లోనే భారీ సిక్సర్‌తో స్టార్క్‌ను స్వాగతించినప్పటికీ.. స్టార్క్ మాత్రం తడబడలేదు. మూడో బంతికే అద్భుతమైన డెలివరీతో జైస్వాల్‌ను ఔట్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ తర్వాత సెంచరీకి చేరువవుతున్న రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌తో పాటు రవీంద్ర జడేజా వికెట్లను కూడా తీసి రాజస్థాన్ స్కోరు వేగానికి బ్రేకులు వేశాడు. 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి తన రాకను ఘనంగా చాటాడు.
ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ స్టార్ పేసర్
దాదాపు 3 నెలల పాటు ఏ బ్యాటర్‌కు బౌలింగ్ చేయకుండా నేరుగా ఐపీఎల్ లాంటి హై-వోల్టేజ్ టోర్నీలో ఆడటం అంత సులభం కాదని స్టార్క్ అంగీకరించాడు. "బౌలింగ్ స్పీడ్ అందుకోవడానికి, మ్యాచ్ రిథమ్‌లోకి రావడానికి ఈ మ్యాచ్ నాకు బాగా ఉపయోగపడింది. నా మోచేయి గాయం కారణంగా కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. దానికి తగ్గట్టుగా బౌలింగ్ శైలిని మార్చుకుంటున్నాను. ఈ విజయం జట్టుకు ఎంత ముఖ్యమో, నా ఆత్మవిశ్వాసానికి కూడా అంతే ముఖ్యం. రాబోయే మ్యాచ్‌ల్లో నా బౌలింగ్ ప్రదర్శన మరింత మెరుగుపడుతుందని నమ్ముతున్నాను" అని స్టార్క్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications