సోషల్ మీడియా ప్రభావం సామాన్యుల జీవితాలను ఎలా మారుస్తుందో చెప్పడానికి ఈ కుర్రాడి కథే ఓ నిదర్శనంగా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ కేవలం తన బౌలింగ్ వీడియోలతో ఐపీఎల్ వరకు చేరుకున్నాడు ఓ అద్భుతమైన లెగ్ స్పిన్నర్. ఒక్కటంటే ఒక్క ప్రొఫెషనల్ మ్యాచ్ కూడా ఆడకుండానే నేడు ఐపీఎల్ 2026 మినీ వేలంలోకి అడుగుపెడుతున్న ఆ కుర్రాడే ఇజాజ్ సావరియా.
రీల్స్ చేస్తూ ఐపీఎల్ వేలానికి.. ఎవరీ ఇజాజ్ సావరియా?
కేవలం 20 ఏళ్ల వయసున్న ఇజాజ్ సావరియా కథ ఓ సినిమాను తలపిస్తుంది. ఎటువంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లేదా పెద్ద మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేకపోయినా, అతని పేరు నేడు అబుదాబిలో జరిగే వేలం జాబితాలో 265వ నంబర్ వద్ద ఉంది. ఈ స్థాయికి ఇజాజ్ సావరియా చేరుకోవడం వెనుక ఓ ఆసక్తికరమైన ప్రయాణం ఉంది.

ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ప్రశంసతో మారిన తలరాత
ఇజాజ్ సావరియా ఇన్‌స్టాగ్రామ్ లో తన బౌలింగ్ ప్రాక్టీస్ వీడియోలను రీల్స్ రూపంలో పోస్ట్ చేసేవాడు. ఇంగ్లాండ్ స్టార్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ కంట ఈ వీడియోలు పడ్డాయి. ఇజాజ్ బౌలింగ్ యాక్షన్, నైపుణ్యం నచ్చిన ఆదిల్ రషీద్, అతని పోస్ట్ పై పాజిటివ్‌గా కామెంట్ చేశాడు. ఆ ఒక్క కామెంట్ ఇజాజ్‌ను ఓవర్‌నైట్ వైరల్ చేసింది. ఆ తర్వాత ఆదిల్ రషీద్‌తో ఇజాజ్ వ్యక్తిగతంగా కూడా మాట్లాడి తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు.
కర్ణాటక నుంచి రాజస్థాన్ వరకు..
ఇజాజ్ సావరియా కర్ణాటకలోని బీదర్‌లో పెరిగాడు. ఇజాజ్ సావరియా తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేయడం వల్ల అక్కడ ఉండాల్సి వచ్చింది. 2017లో క్రికెట్ నేర్చుకోవడం మొదలుపెట్టినా సరైన అవకాశాలు రాకపోవడంతో 2022లో రాజస్థాన్‌లోని జైపూర్‌కు మకాం మార్చాడు. అక్కడ జిల్లా జట్టులో చోటు దక్కినా మ్యాచ్‌లు ఆడే అవకాశం మాత్రం రాలేదు. దీంతో నిరాశ చెందకుండా తన ప్రాక్టీస్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం ప్రారంభించాడు.
సీఎస్కే, పంజాబ్ కింగ్స్ పిలుపు
ఇజాజ్ రీల్స్ ఎంతలా వైరల్ అయ్యాయంటే, ఐపీఎల్ దిగ్గజ జట్ల దృష్టిని కూడా ఆకర్షించాయి. సీఎస్కే స్కౌట్స్ ఇజాజ్‌ను సంప్రదించి అతనితో చర్చలు జరిపారు.
పంజాబ్ కింగ్స్: మాజీ స్పిన్నర్ సునీల్ జోషి ఇజాజ్ రీల్స్ చూసి అతని నంబర్ అడిగి తెలుసుకున్నారు. లక్నోలో జరిగిన ట్రయల్స్ కు ఇజాజ్‌ను పంజాబ్ కింగ్స్ ఆహ్వానించింది. అక్కడ తన బౌలింగ్ తో కోచ్‌లను మెప్పించడంతో పంజాబ్ టీమ్ అతని డాక్యుమెంట్లను వెరిఫై చేసి ఐపీఎల్ వేలం కోసం రిజిస్ట్రేషన్ చేయించింది.
గల్లీ క్రికెట్ నుంచి నేరుగా గ్లోబల్ లీగ్ వేలం వరకు చేరుకున్న ఇజాజ్ సావరియాను నేడు ఏ జట్టు దక్కించుకుంటుందో చూడాలి. ఒకవేళ అతను వేలంలో అమ్ముడైతే, అది సోషల్ మీడియా సృష్టించిన అతిపెద్ద క్రికెట్ సంచలనంగా మారుతుంది.