IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం నేడు అబుదాబిలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) వద్ద రూ.43.40 కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మొత్తంతో వారు ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో సహా మొత్తం తొమ్మిది మందిని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం సీఎస్కే స్పిన్ విభాగంపై అందరి దృష్టి నెలకొంది.
స్పిన్నర్ల వేటలో సీఎస్కే
చెన్నై జట్టులో కీలక స్పిన్నర్లుగా ఉన్న అశ్విన్ రిటైర్ అవ్వగా.. రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం జట్టులో కేవలం నూర్ అహ్మద్ మాత్రమే ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నారు. దీంతో సీఎస్కే కచ్చితంగా నాణ్యమైన భారతీయ స్పిన్నర్ల కోసం వేట మొదలుపెట్టనుంది. ఈ క్రమంలోనే టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

"చెన్నై నాకు కరెక్ట్ టీమ్" - రాహుల్ చాహర్
దీపక్ చాహర్ తమ్ముడైన రాహుల్ చాహర్ వేలానికి ముందు తన మనసులోని మాటను బయటపెట్టారు. తన బౌలింగ్ శైలికి చెన్నైలోని చెపాక్ స్టేడియం సరైన వేదిక అని ఆయన అభిప్రాయపడ్డారు. "చెన్నై మైదానంలో నాకు మంచి రికార్డు ఉంది. అక్కడ బంతి ఎలా స్పందిస్తుందో నాకు బాగా తెలుసు. నా బౌలింగ్‌కు సీఎస్కే అత్యుత్తమ జట్టుగా ఉంటుంది" అని రాహుల్ పేర్కొన్నారు. రాజస్థాన్ తన సొంత రాష్ట్రం కాబట్టి, రాజస్థాన్ రాయల్స్ లేదా సీఎస్కే తనను కొనుగోలు చేస్తే చాలా సంతోషిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాహుల్ చాహర్ గణాంకాలు
26 ఏళ్ల రాహుల్ చాహర్ గత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం దక్కించుకున్నారు. అయితే, ఓవరాల్‌గా ఆయనకు ఐపీఎల్‌లో మంచి అనుభవం ఉంది. రాహుల్ చాహర్ మొత్తంగా 79 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 75 వికెట్లు తీశాడు. చెపాక్ స్టేడియంలో 9 మ్యాచ్‌లాడి 14 వికెట్లు పడగొట్టాడు. ఇక్కడ అతడి ఎకానమీ రేటు కేవలం 6.19 మాత్రమే ఉండటం విశేషం. ఈ వేలంలో రాహుల్ చాహర్ బేస్ ధర రూ. 1 కోటిగా నిర్ణయించబడింది. దీపక్ చాహర్ సీఎస్కేలో స్టార్‌గా ఎదిగినట్లుగానే, రాహుల్ చాహర్‌ను కూడా ధోనీ సేన దక్కించుకుంటుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.