IPL Auction 2026: ఐపీఎల్ 19వ సీజన్ కోసం జరిగే మినీ వేలానికి రంగం సిద్ధమైంది. నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు అబుదాబిలోని ఎతిహాద్ స్టేడియం వేదికగా వేలం ప్రారంభం కానుంది. ఈ వేలంలో 10 జట్లు కలిసి 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. ఈ మెగా ఈవెంట్ గురించి తెలుసుకోవాల్సిన 5 ప్రధాన అంశాలు ఇక్కడ ఉన్నాయి.
ఆల్‌రౌండర్ల కోసం భారీ యుద్ధం: గ్రీన్, లివింగ్‌స్టోన్‌లకు రికార్డు ధర!
ఈ మినీ వేలంలో అందరి దృష్టి ఆస్ట్రేలియాకు చెందిన వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌పైనే ఉంది. గ్రీన్‌పై భారీగా డబ్బులు కురిపించే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్‌లో నాణ్యమైన బౌలింగ్ ఆల్‌రౌండర్లు లేరు. కేకేఆర్, సీఎస్కేలకు ఆల్‌రౌండర్ల అవసరం ఉంది, కాబట్టి వారి పర్సులలో అత్యధిక డబ్బు ఉంది కాబట్టి, గ్రీన్‌ను దక్కించుకోవడానికి ఈ రెండు జట్ల మధ్య తీవ్ర పోటీ ఉండవచ్చు.ఇంగ్లాండ్‌కు చెందిన విధ్వంసకర బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ కూడా రూ.2 కోట్ల బేస్ ధరతో అత్యధిక బిడ్లను అందుకునే అవకాశం ఉంది. లివింగ్‌స్టోన్, డికాక్‌లు రూ.9 కోట్ల మార్కును సులభంగా దాటే అవకాశం ఉందని అంచనా.

2. కేకేఆర్, సీఎస్కే వద్ద అత్యధిక డబ్బు
జట్లలో డబ్బు, స్లాట్‌ల లభ్యత ఆధారంగా KKR, CSK ఈ వేలంలో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వద్ద అధికంగా 64.30 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉండగా.. ఆ జట్టుకు కొనుగోలు చేయాల్సిన 13 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వద్ద రూ.43.40 కోట్లు ఉండగా.. వారు 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు 9 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. కేకేఆర్ కొత్త జట్టును నిర్మించుకోవాలని చూస్తుండగా.. సీఎస్కే తమ స్క్వాడ్‌ను పటిష్టం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.
3. ముంబై ఇండియన్స్ పాత్ర తక్కువ
ముంబై ఇండియన్స్ వద్ద కేవలం రూ.2.75 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ వేలంలో ఎక్కువ పాత్ర పోషించలేదు. ఆ జట్టు కొన్ని అన్‌క్యాప్డ్ (అంతర్జాతీయ క్రికెట్ ఆడని) ఆటగాళ్లను వారి బేస్ ధరకే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపవచ్చు.
4. మినీ వేలం ఎందుకు ఆసక్తికరం?
మెగా వేలం కంటే మినీ వేలం ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది, ఎందుకంటే ఫ్రాంచైజీలు ప్రత్యేక లక్ష్యాలతో వేలానికి వస్తాయి. తమకు కావలసిన నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను దక్కించుకోవడానికి అవి ఎంత ధరకైనా వెళ్ళడానికి సిద్ధపడతాయి. ఈ వేలంలో రైట్ టు మ్యాచ్ (RTM) కార్డు ఉపయోగించే అవకాశం ఉండదు.
5. వెంకటేష్ అయ్యర్ భవితవ్యంపై ఉత్కంఠ
వెంకటేష్ అయ్యర్‌ను కేకేఆర్ గతంలో రూ.23.75 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే అతని ప్రదర్శన ఆ మొత్తాన్ని సమర్థించలేకపోయింది. ఈ వేలంలో వెంకటేష్ అయ్యర్ కోసం రూ.10 కోట్ల కంటే ఎక్కువ బిడ్ వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. RTM అవకాశం లేకపోవడంతో KKR అతన్ని తిరిగి దక్కించుకోవాలంటే వేలంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.