IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ఘనంగా ప్రారంభం కానుంది. అయితే టోర్నీ మొదలవ్వకముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాకు చెందిన కీలక వేగవంతమైన బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ గాయాల కారణంగా తమ జట్ల తొలి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని సమాచారం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ప్రస్తుతం కండరాల నొప్పి, అకిలీస్ (పాదం మడమ వెనుక భాగంలో) సమస్యతో బాధపడుతున్నాడు.35 ఏళ్ల ఈ పేసర్ గత 5 నెలలుగా ఎటువంటి పోటీ క్రికెట్ ఆడలేదు. గతేడాది జరిగిన ఐపీఎల్ 2025 వేలంలో ఆర్సీబీ జోష్ హేజిల్‌వుడ్‌ను రూ.12.5 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ పెట్టుబడికి తగ్గట్టుగానే హేజిల్‌వుడ్ గత సీజన్లో 12 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలవడంలో వెన్నెముకగా నిలిచాడు. ఇప్పుడు ర్ జోష్ హేజిల్‌వుడ్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానుండటంతో ఆర్‌సీబీ యాజమాన్యం ప్రత్యామ్నాయంగా జాకబ్ డఫీ లేదా నువాన్ తుషారా వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నుగాయంతో బాధపడుతున్నాడు. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో జరిగే సీజన్ తొలి మ్యాచ్‌కు ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా దూరం కానున్నాడు. ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 72 మ్యాచ్‌లు ఆడిన కమిన్స్ 79 వికెట్లు సాధించాడు. ముఖ్యంగా గత రెండు సీజన్లలో సన్‌రైజర్స్ తరపున 30 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు తీసి జట్టును ముందుండి నడిపించాడు. కమిన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగంలోనే కాకుండా నాయకత్వ పరంగా కూడా లోటు కనిపిస్తోంది.
కమిన్స్ గైర్హాజరీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఎవరు నడిపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో దేశవాళీ క్రికెట్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉన్న ఇషాన్ కిషన్ లేదా యువ సంచలనం అభిషేక్ శర్మలలో ఒకరికి తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే యోచనలో ఫ్రాంచైజీ ఉంది. ఇక బౌలింగ్ పరంగా కమిన్స్ స్థానాన్ని బ్రైడన్ కార్స్ లేదా ఎహసాన్ మలింగలతో భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. కీలకమైన మొదటి మ్యాచ్‌ల్లోనే తమ ప్రధాన అస్త్రాలు అందుబాటులో లేకపోవడం ఆర్సీబీ , ఎస్‌ఆర్‌హెచ్ జట్ల వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. హేజిల్‌వుడ్, కమిన్స్ ఎంత త్వరగా కోలుకుని మైదానంలోకి దిగుతారో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.