ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ సీజన్ ఆరంభంలో కాస్త పరవాలేదనిపించినా.. ప్రస్తుతం వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలవో 9వ స్థానానికి పడిపోయింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 119 పరుగులకే ఆలౌట్ కావడం జట్టు వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ చేతుల్లో కూడా వరుసగా ఓటమి పాలు కావడం లక్నో ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది.
అతి ప్రయోగాలే శాపంగా మారాయా?
గత సీజన్లో అద్భుతంగా రాణించిన బ్యాటింగ్ లైనప్‌ను లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం పూర్తిగా చిందరవందర చేసింది. గతేడాది మిచెల్ మార్ష్(627 పరుగులు), ఎయిడెన్ మార్‌క్రమ్ (445 పరుగులు) ఓపెనర్లుగా అదరగొట్టారు. మూడో స్థానంలో నికోలస్ పూరన్ మెరుపు స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. కానీ ఈ సారి వీరి స్థానాలను ఇష్టానుసారంగా మార్చడం జట్టును దెబ్బతీసింది. ఫినిషర్‌గా రాణించాల్సిన ఆయుష్ బదోనీని అనుభవం లేకపోయినా ఓపెనర్‌గా పంపిస్తున్నారు. అలాగే నికోలస్ పూరన్‌ను 5వ స్థానానికి పంపడంతో అతను క్రీజులో ఇబ్బంది పడుతున్నాడు. రిషబ్ పంత్ కూడా తన బ్యాటింగ్ స్థానంపై స్పష్టత లేక విఫలమవుతున్నాడు.

విదేశీ ప్లేయర్ల వినియోగంలో వైఫల్యం
జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లను ఆడించే అవకాశం ఉన్నప్పటికీ.. లక్నో కేవలం ముగ్గురితోనే బరిలోకి దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మాథ్యూ బ్రిట్జ్‌కే లాంటి ప్రతిభావంతుడైన ప్లేయర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అతని స్థానంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ హిమ్మత్ సింగ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవడం జట్టు యాజమాన్యం నిర్ణయాలపై సందేహాలను పెంచుతోంది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల జట్టు పరాజయాల బాట పడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బలమైన బౌలింగ్ ఉన్నా.. దెబ్బకొడుతోన్న బ్యాటింగ్
గత సీజన్లో బౌలర్ల గాయాలతో ఇబ్బంది పడ్డ లక్నోకు ఈ సారి బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీ, ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ వంటి స్టార్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు. స్పిన్ విభాగంలో దిగ్వేష్ రాఠీ పర్వాలేదనిపిస్తున్నాడు. బౌలింగ్ విభాగం బలంగా ఉన్నప్పటికీ.. బ్యాటర్లు సమష్టిగా రాణించకపోవడం, ప్రతి మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం వల్ల జట్టు స్థిరత్వాన్ని కోల్పోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి త్వరగానే తప్పుకోవాల్సి వస్తుంది.