IPL 2026: రూ. 43 కోట్లు బొక్కా.. కేకేఆర్ నుంచి ఆ ఇద్దరు అవుట్!
IPL 2026: ఐపీఎల్ చరిత్రలో 3 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఈ ఏడాది తీవ్ర నిరాశే మిగిలింది. ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. 2024లో టైటిల్ గెలిచిన కేకేఆర్ జట్టు.. 2025, 2026 సీజన్లలో వరుసగా గ్రూప్ దశ నుంచే వెనుదిరగడం గమనార్హం. ఈ సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలతో కుదేలైన కేకేఆర్.. మొదటి 6 మ్యాచ్‌లలో ఒక్కటంటే ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. ఆ తర్వాత పుంజుకుని తదుపరి 8 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించినప్పటికీ.. ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి అది సరిపోలేదు.
ఈ ఘోర పరాజయం తర్వాత కేకేఆర్ జట్టులో భారీ మార్పులు జరగబోతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెట్ నిపుణుడు ఆరోన్ ఫించ్ కేకేఆర్ యాజమాన్యానికి ఓ షాకింగ్ సలహా ఇచ్చాడు. జట్టులో దాదాపు రూ.43 కోట్లకు పైగా విలువైన ఇద్దరు అగ్రశ్రేణి ప్లేయర్లను తక్షణమే రిలీజ్ చేయాలని ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. ఆ ఇద్దరు ప్లేయర్లు మరెవరో కాదు.. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, శ్రీలంక స్టార్ పేసర్ మతీషా పతిరానా.

కామెరూన్ గ్రీన్
కామెరూన్ గ్రీన్‌ను విడుదల చేయాలని చెప్పడానికి గల కారణాలను ఆరోన్ ఫించ్ వివరిస్తూ.. "కామెరూన్ గ్రీన్ ఫిట్‌నెస్, అతని శరీరం ఎప్పుడు ఎలా సహకరిస్తుందో ఎవరికీ తెలియదు. పైగా ఆస్ట్రేలియా జట్టు రాబోయే రోజుల్లో భారీగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి గ్రీన్ వర్క్‌లోడ్‌ను గమనించడం చాలా ముఖ్యం. కేకేఆర్ ప్రస్తుతానికి గ్రీన్‌ను విడుదల చేసి, ఆ తర్వాత తక్కువ ధరకే మళ్లీ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది" అని ఆరోన్ ఫించ్ అన్నాడు. కాగా ఐపీఎల్ వేలంలో కేకేఆర్ కామెరూన్ గ్రీన్‌ను రూ. 25 కోట్ల 20 లక్షల భారీ ధరతో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
మతీషా పతిరానా
మరోవైపు శ్రీలంక పేసర్ మతీషా పతిరానాను కూడా జట్టు నుంచి వదిలేయాలని ఆరోన్ ఫించ్ సలహా ఇచ్చాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో కేకేఆర్ పతిరానాను రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే గాయం కారణంగా ఈ సీజన్ ముగింపు దశలో జట్టుతో చేరిన మతీషా పతిరానా.. తాను వేసిన రెండో ఓవర్లలోనే మళ్లీ గాయపడి టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇంత భారీ ధర పెట్టి కొన్న ఆటగాడు అందుబాటులో లేకపోవడం జట్టును దెబ్బతీసిందని, అందుకే పతిరానాను విడుదల చేసి తక్కువ ధరకు తిరిగి దక్కించుకోవాలని ఫించ్ పేర్కొన్నాడు.
అజింక్యా రహానే
ఇదే సమయంలో కేకేఆర్ ప్రస్తుత కెప్టెన్ అజింక్యా రహానే విషయంలో ఆరోన్ ఫించ్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కేకేఆర్ రహానేను జట్టులోనే కొనసాగించాలని ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు. 37 ఏళ్ల అజింక్యా రహానేను కేకేఆర్ కేవలం రూ.1.5 కోట్లకు కొనుగోలు చేయగా.. ఈ సీజన్లో రహానే 14 మ్యాచ్‌ల్లో 36 సగటుతో, 135 స్ట్రైక్ రేట్‌తో 335 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా 5 కంటే ఎక్కువ ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ తర్వాత రహానే స్ట్రైక్ రేట్ అత్యంత పేలవంగా ఉన్నప్పటికీ.. జట్టును నడిపించడంలో అతని అనుభవం ఉపయోగపడుతుందని ఫించ్ అభిప్రాయపడ్డాడు. మరి కేకేఆర్ జట్టు యాజమాన్యం ఆరోన్ ఫించ్ ఇచ్చిన ఈ సలహాలను పరిగణనలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications