ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన 20వ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్నప్పటికీ.. అభిమానులకు రెండు చేదువార్తలు వినిపించాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చీలమండ (Ankle) గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. బ్యాటింగ్ సమయంలో 38 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టుకు మంచి పునాది వేసిన కోహ్లీ.. ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. విరాట్ కోహ్లీ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సుయాష్ శర్మ మైదానంలోకి వచ్చాడు. కోహ్లీ వంటి చురుకైన ఆటగాడు మైదానంలో లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ముంబైపై కోహ్లీ సరికొత్త రికార్డు:
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌పై 1,000 పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాటర్‌గా విరాట్ రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఈ సీజన్‌లో ఆయన అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 59.66 సగటుతో 179 పరుగులు చేశారు. అయితే గాయం తీవ్రత ఎంత ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరగబోయే తదుపరి మ్యాచ్‌కు ఆయన అందుబాటులో ఉంటారా లేదా అన్నది ఆర్సీబీ యాజమాన్యం ఇచ్చే అధికారిక ప్రకటనపై ఆధారపడి ఉంటుంది.

రోహిత్ శర్మకు కూడా గాయం
ఈ మ్యాచ్ కేవలం కోహ్లీకే కాదు.. ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు కూడా కలిసి రాలేదు. 241 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఉన్న ముంబైకి రోహిత్ గాయం పెద్ద దెబ్బ తీసింది. హ్యామ్‌స్ట్రింగ్ సమస్య కారణంగా రోహిత్ 19 పరుగుల వద్ద ఉండగానే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత ఆయన తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు. ఇద్దరు భారత దిగ్గజ ఆటగాళ్లు ఒకే మ్యాచ్‌లో గాయపడటం క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఆర్సీబీ ఘన విజయం
మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లీ(50), రజత్ పాటిదార్ (53) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో వాంఖడే స్టేడియంలో అత్యధిక స్కోరు నమోదైంది. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ గట్టిగానే పోరాడింది. హార్దిక్ పాండ్యా (40), రూథర్‌ఫోర్డ్(71) చివర్లో విరుచుకుపడినప్పటికీ.. ముంబై 20 ఓవర్లలో 222 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.