IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో నేడు(ఏప్రిల్ 4) అభిమానులకు మసలైన మజా అందనుంది. ఇవాళ తొలి డబుల్ హెడర్ సందడి షురూ కానుంది. మధ్యాహ్నం ఢిల్లీ వేదికగా ఒక మ్యాచ్, రాత్రి అహ్మదాబాద్ వేదికగా మరో మ్యాచ్ క్రికెట్ ప్రేమికులను అలరించనున్నాయి. నేడు జరగబోయే మొదటి పోరులో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్లు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ ఆసక్తికర పోరు ప్రారంభం కానుంది.
మొదటి మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ ముంబై.. ఢిల్లీకి టాపార్డర్ కష్టాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో తన మొదటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై విజయం సాధించినప్పటికీ.. ఆ జట్టు టాపార్డర్ వైఫల్యం ఆందోళన కలిగిస్తోంది. గత మ్యాచ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ అవ్వగా.. నితీష్ రాణా, పాతుమ్ నిస్సంక కూడా నిరాశపరిచారు. అయితే 22 ఏళ్ల యువ సంచలనం సమీర్ రిజ్వీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అతనికి అనుభవజ్ఞుడైన ట్రిస్టన్ స్టబ్స్ తోడవ్వడంతో ఢిల్లీ జట్టు విజయ తీరాలకు చేరింది. నేటి మ్యాచ్‌లో ఓపెనింగ్ జోడీగా పృథ్వీ షా లేదా అభిషేక్ పోరెల్‌లో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ అందుబాటులో లేకపోయినా.. లుంగీ ఎన్గిడి, నటరాజన్, ముఖేష్ కుమార్ పటిష్టంగా కనిపిస్తున్నారు.

ముంబై బ్యాటింగ్ విధ్వంసం
మరోవైపు ఐపీఎల్ చరిత్రలో తొలి మ్యాచ్‌లో ఓడిపోయే సెంటిమెంట్‌ను ఈసారి ముంబై ఇండియన్స్ చెరిపివేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయంతో ముంబై ఆటగాళ్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ (78 పరుగులు) తన పాత రోజులను గుర్తు చేస్తూ మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. అతనికి తోడుగా ర్యాన్ రికెల్టన్ (81 పరుగులు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా వంటి హిట్టర్లతో ముంబై బ్యాటింగ్ లైనప్ అత్యంత ప్రమాదకరంగా ఉంది. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, శార్దూల్ ఠాకూర్ వంటి దిగ్గజాలు ఢిల్లీని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సొంత గడ్డపై ఢిల్లీ తన ఆధిపత్యాన్ని చాటుకుంటుందా లేక పటిష్టమైన ముంబై రెండో విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాలి!
జట్లు (అంచనా):
ఢిల్లీ క్యాపిటల్స్: అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, నటరాజన్, లుంగీ ఎన్గిడి, పాతుమ్ నిస్సంక తదితరులు.
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, శార్దూల్ ఠాకూర్, మిచెల్ సాంట్నర్
రెండో పోరులో రాజస్థాన్ రాయల్స్ Vs గుజరాత్ టైటాన్స్
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం అంతా రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల 'వండర్ బాయ్' వైభవ్ సూర్యవంశీ గురించే మాట్లాడుకుంటోంది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది సంచలనం సృష్టించిన వైభవ్‌కు నేడు అసలైన పరీక్ష ఎదురుకానుంది. గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్న కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి అంతర్జాతీయ స్థాయి పేసర్లను ఈ కుర్రాడు ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది.
బ్యాటర్లకు స్వర్గధామం అహ్మదాబాద్
నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. అయితే గుజరాత్ టైటాన్స్ జట్టు తమ టాప్-3 బ్యాటర్లపైనే అతిగా ఆధారపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్ గత మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. సాయి సుదర్శన్ కూడా గాయం తర్వాత ఫామ్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మిడిలార్డర్‌లో షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా ఫామ్ గుజరాత్ మేనేజ్‌మెంట్‌కు సవాలుగా మారింది.
రాయల్స్ కెప్టెన్సీపై చర్చ
రాజస్థాన్ రాయల్స్ జట్టు కాగితంపై బలంగా కనిపిస్తున్నప్పటికీ, అస్సాం క్రికెటర్ రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ ఇవ్వడంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ రియాన్ పరాగ్‌ను ఎంచుకోవడం గమనార్హం. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ వంటి స్పీడ్‌స్టర్లు గిల్, బట్లర్‌లను ఆదిలోనే కట్టడి చేయాలని భావిస్తున్నారు. 2022 ఫైనలిస్టుల మధ్య జరగనున్న ఈ పోరులో ఆధిపత్యం ఎవరిదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే!
జట్లు (అంచనా):
రాజస్థాన్ రాయల్స్: రియాన్ పరాగ్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్.