ఈ కుర్రాడు మామూలోడు కాదు.. 103 మీటర్ల సిక్సర్‌తో ఊచకోత! (వీడియో)
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఐపీఎల్‌లో రాత్రికి రాత్రే స్టార్లు పుట్టుకురావడం సర్వసాధారమే. మంగళవారం ముల్లంపూర్‌లోని మహారాజ యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సాక్షిగా ఐపీఎల్ 2026లో ఓ కొత్త స్టార్ పుట్టుకొచ్చాడు. పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కూపర్ కాన్లీ.. తన అరంగేట్ర మ్యాచ్ లోనే అసాధారణ ఇన్నింగ్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టును ఆదుకోవడమే కాకుండా.. ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా దీటుగా ఎదుర్కొని జట్టుకు ఈ సీజన్లో తొలి విజయాన్ని అందించాడు. కేవలం 22 ఏళ్ల వయసులోనే ఇంతటి పరిణతితో ఆడటం చూసి క్రికెట్ విశ్లేషకులు కూడా ఫిదా అవుతున్నారు.
రషీద్ ఖాన్ ముఖం వెలవెలబోయేలా భారీ సిక్సర్
గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైలైట్ ఏదైనా ఉందంటే.. అది రషీద్ ఖాన్ బౌలింగ్‌లో కూపర్ కాన్లీ కొట్టిన భారీ సిక్సరే. సాధారణంగా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పరుగులు తీయడానికే దిగ్గజ బ్యాటర్లు తడబడుతుంటారు. కానీ కూపర్ కాన్లీ మాత్రం రషీద్ ఖాన్ వేసిన ఓ షార్ట్ లెంగ్త్ డెలివరీని ముందే పసిగట్టి, మిడ్ వికెట్ మీదుగా కళ్లు చెదిరే షాట్ ఆడాడు. ఆ బంతి ఏకంగా 103 మీటర్ల దూరం వెళ్లి స్టాండ్స్‌లో పడింది. ఐపీఎల్ 2026లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిక్సర్‌గా నమోదైంది. ఆ సిక్సర్ బాదడాన్ని చూసి బౌలర్ రషీద్ ఖాన్ కూడా ఆశ్చర్యపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

అరంగేట్ర మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు ఒకానొక దశలో కష్టాల్లో ఉండగా.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కూపర్ కాన్లీ బాధ్యతాయుతంగా ఆడాడు. కేవలం 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 163.64 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టించిన ఈ కుర్రాడికి.. తన తొలి మ్యాచ్‌లోనే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించడం విశేషం. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (37) అందించిన సహకారంతో పంజాబ్ కింగ్స్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
పంజాబ్ కింగ్స్ గెలుపు జోష్.. గుజరాత్‌కు బిగ్ షాక్
ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి గుజరాత్ టైటాన్స్ జట్టును 162 పరుగులకే కట్టడి చేశాడు. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(2 వికెట్లు), వైశాఖ్ విజయ్‌కుమార్ 3 వికెట్లతో చెలరేగగా.. బ్యాటింగ్‌లో కూపర్ కాన్లీ(72) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. గుజరాత్ జట్టులో శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్ రాణించినప్పటికీ.. కూపర్ కాన్లీ మెరుపుల ముందు వారి స్కోరు సరిపోలేదు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తమ ఖాతా తెరవగా.. కూపర్ కాన్లీ రూపంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఓ నమ్మకమైన ఫినిషర్ దొరికాడని అభిమానులు సంబరపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications