IPL 2026: ఐపీఎల్ 2026 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌పై కాసుల వర్షం కురిసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ మొత్తాన్ని వెచ్చించి రూ.25.20 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. అయితే విచిత్రమేమిటంట.. ఇంత భారీ ధరకు అమ్ముడైన మరుసటి రోజే కామెరాన్ గ్రీన్ డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం. బుధవారం అడిలైడ్‌లో ప్రారంభమైన మూడో యాషెస్ టెస్ట్ మొదటి రోజే ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతికి కామెరాన్ గ్రీన్ డకౌట్‌గా వెనుదిరిగారు.
ఐపీఎల్ వేలంలో 25 ఏళ్ల కామెరాన్ గ్రీన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. చెన్నై ఏకంగా 25 కోట్ల వరకు వేలం పాడింది. అయితే వేలంలో 64.3 కోట్ల బడ్జెట్‌తో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ కామెరాన్ గ్రీన్‌ను దక్కించుకుని ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడి రికార్డును నెలకొల్పింది. గతంలో 2024 సీజన్‌లో మిచెల్ స్టార్క్‌ను కేకేఆర్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేయగా .. ఇప్పుడు గ్రీన్ ఆ రికార్డును అధిగమించాడు.

ఈడెన్ గార్డెన్స్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా: గ్రీన్
కోల్‌కతా నైట్ రైడర్స్ తన అధికారిక 'X' (గతంలో ట్విట్టర్) ఖాతాలో గ్రీన్‌కు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో గ్రీన్ మాట్లాడుతూ.. "ఈ ఏడాది కోల్‌కతా జట్టులో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో ఆడేందుకు, అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ ఏడాది మాకు అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు.
ఐపీఎల్‌లో గ్రీన్ గణాంకాలు
కామెరాన్ గ్రీన్ రాకతో కేకేఆర్ జట్టు మరింత బలోపేతం కానుంది. అతను బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించగలడు. గ్రీన్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 29 మ్యాచ్‌లు ఆడి 41.58 సగటుతో 707 పరుగులు సాధించాడు. ఇందులో 2 అర్థ శతకాలు, ఒక సెంచరీ ఉన్నాయి. బౌలింగ్‌లో 16 వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా గ్రీన్ గత సీజన్ వేలానికి దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ రికార్డు ధరతో ఐపీఎల్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే వేలం జరిగిన వెంటనే టెస్ట్ మ్యాచ్‌లో సున్నాకే ఔట్ కావడం చర్చనీయాంశంగా మారింది.