Rishabh Pant: ఈ ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శనతో పడి లేస్తూ ముందుకెళ్తోంది. ఇప్పటి వరకూ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఐదు మాత్రమే గెలిచింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ ఆటతీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే మెగా వేలంలో రికార్డు (రూ.27 కోట్లు) ధరకు కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది లక్నో యాజమాన్యం. కానీ అతడు మాత్రం అన్నీ మ్యాచ్‌ల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ దిల్లీ క్యాపిటల్స్ మ్యాచులోనూ కెప్టెన్ రిషభ్ పంత్ మళ్లీ నిరాశ పరిచాడు. దీంతో అతడిపై తీవ్రంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి.
అయితే ఇదే సమయంలో దిల్లీతో జరిగిన ఈ మ్యాచులో లక్నో బ్యాటింగ్ ఆర్డర్ మారడంపై కూడా క్రికెట్ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పంత్ నెం.7వ స్థానంలో దిగడంపై మాట్లాడుకుంటున్నారు. అతడెందుకు ఈ స్థానంలో దిగాడా అని తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకు పంత్ పెలవ ప్రదర్శన చేసినప్పటికీ సాధారణంగా.. అతడి బ్యాటింగ్ స్థానం నెం.4గా ఉంటుంది. కానీ దిల్లీతో జరిగిన మ్యాచులో నెం.7లో దిగాడు.

ఈ మ్యాచులో ప్రమాదకర బ్యాటర్ నికోలస్ పూరన్ ఔటవ్వగానే, పంత్ క్రీజులోకి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అబ్దుల్ సమాద్ వచ్చాడు. ఆ తర్వాత ఆయుష్ బదోనీ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. పంత్ ఆఖర్లో వచ్చి 2 బంతులు ఎదుర్కొని 0 పరుగులకు వెనుదిరిగాడు.
బ్యాటింగ్ ఆర్డర్ పై పంత్ మాట్లాడుతూ.. "పరిస్థితిని అనుకూలంగా చేసుకునేందుకు బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేశాం. అబ్దుల్ సమాద్ ఈ పిచ్ పై ఎక్కువ పరుగులు చేస్తాడని అనుకున్నాం. తర్వాత మిల్లర్ వచ్చాడు. మయాంక్ యాదవ్ లేని కారణంగా ఆయూష్ బదోనీని ఇంపాక్ట్ ప్లేయర్ గా పంపించాం. ఉత్తమ కలయిక కోసం ప్రయత్నించాం." అని చెప్పుకొచ్చాడు.
ఇదే సమయంలో మ్యాచులో పంత్ చేతికి బ్యాండేజ్ కట్టుకుని కనిపించాడు. దీంతో అతడికి గాయమైందని, అందుకే అతడు ఆఖర్లో బ్యాటింగ్ కు వచ్చాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. లక్నో మెంటార్ జహీర్ ఖాన్, కోచ్ జస్టిన్ లాంగర్ నిర్ణయం మేరకే పంత్ నెం.7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పైగా నెం.7వ స్థానంలో పంత్ రావడం కూడా.. జట్టు ఓటమికి ప్రధానకారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.