IPL 2025 Yash Dayal: ఐపీఎల్ 2025 తాజా మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌పై 2 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. యశ్ దయాళ్ చివరి ఓవర్‌ను అద్భుతంగా సంధించి, ధోనీని ఔట్ చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే తాజాగా తన కొడుకు సాధించిన ఘనతపై యశ్ దయాళ్ తండ్రి చందర్ పాల్ ఆనందం వ్యక్తం చేశాడు. యశ్ దయాళ్ ఎదుగుదలలో కోహ్లీ కీలకంగా వ్యవహరించాడని అన్నాడు. మానసికంగా అతడికి అండగా నిలిచాడని పేర్కొన్నాడు.
కోహ్లీ మద్దతుగా..
"గత సీజన్‌కు ముందు యశ్ పై తీవ్ర ఒత్తిడి ఉండేది. గుజరాత్ తరఫున ఆడేటప్పుడు యశ్ బౌలింగ్ లో రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సులు బాదడం, నా కొడుక్కి మానసికంగా పెద్ద దెబ్బే. దీంతో అతడు మళ్లీ క్రీజులోకి రావాలంటే ఎంతో ధైర్యం కావాలి. కానీ ఆర్సీబీలోకి వచ్చాక, కోహ్లీనే నా కొడుకుతో మాట్లాడి మద్దతుగా నిలిచాడు. అతడిలో ఆత్వవిశ్వాసాన్ని నింపాడు." అని చందర్‌పాల్ చెప్పారు.

విరాట్ అన్న ఆ ఒక్క మాట..
"యశ్ కు విరాట్ కోహ్లీ ఎంతో మద్దతు ఇచ్చాడు. ఆర్సీబీలోకి అతడు జాయిన్ అయ్యాక, చాలాసార్లు తన రూమ్‌కు పిలిచేవాడు. కొన్నిసార్లు తానే యశ్ రూమ్‌కు వెళ్ళేవాడు. ఇద్దరూ కలిసి 2024 సీజన్ ప్రదర్శన గురించి మాట్లాడుకునేవారు. అప్పుడు విరాట్ ఒక మాట అన్నాడు. 'తీవ్రంగా కష్టపడు. ఒక తుఫాను లాంటి ఆట ఆడు. నేను నీ వెంట ఉంటాను. టెన్షన్ పడొద్దు. కష్టపడటం ఆపొద్దు. తప్పులు చేయ్, కానీ వాటి నుంచి నేర్చుకొని ముందుకెళ్లు.' అని నా కొడుకుతో చెప్పాడు.
విరాట్ అతడికి ఎంతో స్వేచ్ఛ ఇచ్చాడు. భయం లేని ఆటగాడిగా తీర్చిదిద్దాడు. అతడు నా కొడుక్కి కేవలం క్రికెట్ మిత్రుడే కాదు, మానసికంగా అండగా నిలబడిన వ్యక్తి. నేను చాలా మంది క్రికెటర్లను, ముఖ్యంగా బౌలర్లను మానసికంగా దెబ్బతిన్న వాళ్లను చూశాను. కానీ విరాట్ మళ్లీ వాళ్లను బలంగా తిరిగి పుంజుకునేలా చేయగలడు. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపగలడు." అని చందర్‌పాల్ ప్రశంసలు కురిపించారు.
YASH DAYAL'S FATHER ON VIRAT KOHLI:
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 4, 2025
"Virat has supported Yash a lot. He has backed him and told 'toofan macha de. Main hoon tere saath' before that over in 2024. Virat has given him a lot of freedom and turned him into a fearless cricketer". (TOI). pic.twitter.com/Pl2vmZmlMS