ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభం కానుంది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందినే షార్ట్ లిస్ట్ చేసింది.
వాళ్లలో మొత్తంగా 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్లలో 366 మంది భారత ఆటగాళ్లు, 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే కొన్ని ఫ్రాంచైజీలు వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నాయి. ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ఎవరిని దక్కించుకోవాలి, భారీ మొత్తాన్ని ఎవరి కోసం వెచ్చించాలని స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆర్‌టీఎమ్‌తో ముగ్గరు స్టార్ ప్లేయర్లలో ఒకరినే సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంది. గత సీజన్‌లో సరికొత్త బ్రాండ్ క్రికెట్‌తో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అయిదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి కోసం రూ.75 కోట్లు వెచ్చించింది. మిగిలిన రూ.45 కోట్లతో సన్‌రైజర్స్ గరిష్టంగా 20 మందిని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందులో 5గురు విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది.
అయితే ఈ క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్ సీఈవో కావ్య మారన్ తమ దగ్గర ఉన్న తక్కువ మొత్తంతో నాణ్యమైన ప్లేయర్లను సొంతం చేసుకోవాలని భావిస్తుంది. అన్‌క్యాప్డ్ ఆర్‌టీఎమ్ కార్డ్‌ను జాగ్రత్తగా ఉపయోగించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ఆర్‌టీఎమ్‌తో దక్కించుకోవడానికి ముగ్గురు మాజీ ప్లేయర్లు అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండేపై కన్నేసింది. వాళ్లలో ఒక్కరిని తిరిగి తమ గూటికి తీసుకురావాలని నిర్ణయించుకుంది.

గత అయిదు సీజన్లుగా అబ్దుల్ సమద్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తోనే ఉన్నాడు. భారీ హిట్టర్‌గా కొన్ని మ్యాచ్‌ల్లో కీలకపాత్ర పోషించాడు. కానీ ఇటీవల అంచనాలను అందుకోలేకపోతున్నాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 182 పరుగులే చేశాడు. అయితే గతంలో రియాన్ పరాగ్‌కు రాజస్థాన్ రాయల్స్ మద్దతు ఇచ్చినట్లుగా అబ్దుల్ సమద్‌కు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. అయితే అబ్దుల్ సమద్‌కు బదులుగా సన్వీర్ సింగ్‌ను ఆర్‌టీఎమ్‌తో రిటైన్ చేసుకునే యోచనలోనూ ఎస్‌ఆర్‌హెచ్ ఉంది.
సన్‌రైజర్స్ తరఫున సన్వీర్ రెండు సీజన్లలో కలిపి ఆరు ఇన్నింగ్స్‌లు ఆడాడు. మూడు సార్లు నాటౌట్‌గా నిలిచి 25 పరుగులే చేశాడు. కానీ ఓవరాల్‌గా టీ20 కెరీర్‌లో సన్వీర్ 187 స్ట్రైక్‌రేటుతో మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు. వీరిద్దరితో పాటు లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే కూడా ఎస్‌ఆర్‌హెచ్ ఆర్‌టీఎమ్ పొటెన్షియల్ లిస్ట్‌లో ఉన్నాడు. అతని ఆరు సీజన్ల ఐపీఎల్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని కావ్య మారన్ భావిస్తుంది.