RCB vs KKR: ఐపీఎల్ 2025 మళ్లీ ప్రారంభం కానుంది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతల మధ్య ఈ టోర్నమెంట్‌ను ఒక వారం పాటు నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గింది. ఐపీఎల్ సీజన్ 18 మే 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ మే 17న సాయంత్ర 7.30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ 2025ను వారం పాటు నిలిపివేసిన తర్వాత విదేశీ ప్లేయర్లు భారత్ నుంచి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు విదేశీ ఆటగాళ్లు సీజన్‌ను పూర్తి చేయడానకి మళ్లీ ఇండియాకు రావడం ప్రారంభించారు. కొంతమంది ఆటగాళ్ల రాకపై సందేహం ఉన్నప్పటికీ కేకేఆర్‌తో జరగనున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయింగ్ 11 గురించి ఉత్కంఠ నెలకొంది.
తిరిగి వచ్చిన ఫిల్ సాల్ట్
ఇంగ్లాండ్ విధ్వంసక ఓపెనర్ ఫిల్ సాల్ట్ తన దేశానికి తిరిగి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆర్సీబీ తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. కేకేఆర్ జట్టుపై విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యాడు. అయితే ఆర్సీబీ చివరి మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ స్థానంలో జాకబ్ బెథెల్ ఆడుతున్నట్లు కనిపించింది. ఈ మ్యాచ్‌లో జాకబ్ బెథెల్ అద్భుతమైన అర్థ సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో జాకబ్‌కు మరోసారి అవకాశం లభిస్తుందనే ఆశ కూడా ఉంది.

మయాంక్ అగర్వాల్ ఎంట్రీ
గాయం కారణంగా ఆర్సీబీ స్టార్ ఆటగాడు దేవదత్ పడిక్కల్ ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత పడిక్కల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ఆర్సీబీ జట్టులో ప్రవేశించాడు. మెగా వేలంలో మయాంక్ అగర్వాల్ అమ్ముడుపోలేదు. కానీ ఇప్పుడు మయాంక్‌కు ఐపీఎల్ సీజన్ 18లో మొదటి మ్యాచ్ ఆడే అవకాశం లభించవచ్చు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఇదే..(అంచనా)
జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(కెప్టెన్), కృనాల్ పాండ్యా, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రొమారియా షెపర్డ్, టిమ్ డేవిడ్, స్వప్నిల్ సింగ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, లుంగి ఎంగిడి.