IPL 2025 DC vs RR: ఐపీఎల్ 2025 32వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించబడింది. ఇరు జట్లు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయాన్ని అందించాడు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే సూపర్ ఓవర్ కూడా టై అయితే .. మ్యాచ్ రిజల్ట్ ఎలా నిర్ణయించబడుతుంది. దీని గురించి ఐపీఎల్ రూల్స్ ఏం చెబుతున్నాయి.
సూపర్ ఓవర్ టై అయితే ఫలితం ఎలా నిర్ణయిస్తారు?
ఐపీఎల్ 2025లో మొదటి సూపర్ ఓవర్ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఆ సూపర్ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మ్యాచ్ టై అయితే తదుపరి 10 నిమిషాల్లో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. దీని తర్వాత సూపర్ ఓవర్‌లో కూడా మ్యాచ్ టై అయితే.. తదుపరి 5 నిమిషాల్లో రెండో సూపర్ ఓవర్ నిర్వహించబడుతుంది. రెండో సూపర్ ఓవర్ కూడా టై అయితే మ్యాచ్ టై అయిన ఒక గంట వరకు సూపర్ ఓవర్లు నిర్వహించవచ్చు. అయితే సూపర్ ఓవర్ ఎప్పుడు ఆడాలో చివరికి అంపైర్లు నిర్ణయిస్తారు. ఇది కాకుండా సూపర్ ఓవర్ ఆడటం సాధ్యం కాకపోతే మ్యాచ్ టై అవుతుంది.

సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం తొలి సూపర్ ఓవర్‌లో బౌలింగ్ చేసిన బౌలర్ రెండో సూపర్ ఓవర్‌లో వేయకూడదు. ఒక్కసారి బౌలింగ్ చేస్తే మరో సూపర్ ఓవర్ వేసేందుకు అవకాశం లేదు. బ్యాటింగ్ విషయంలో చేజింగ్ టీమ్ తొలి సూపర్ ఓవర్ ఆడుతుంది. తొలి సూపర్ ఓవర్ టై అయితే రెండో సూపర్ ఓవర్‌లోనూ చేజింగ్ జట్టే ముందుగా బ్యాటింగ్ చేస్తోంది.తొలి సూపర్ ఓవర్‌లో ఔటైన బ్యాటర్‌కు రెండో సూపర్ ఓవర్‌లో ఆడే అవకాశం ఉండదు. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగే మాత్రం అవకాశం ఉంటుంది. ఇక సూపర్ ఓవర్ ప్రారంభమయ్యే ముందే ముగ్గురు బ్యాటర్ల వివరాలను అంపైర్లకు అందజేయాలి. వారు మాత్రమే బ్యాటింగ్ చేయాలి. సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోతే ఆలౌటైనట్లే.
బుధవారం సూపర్ పరిస్థితి ఇది..
మ్యాచ్ టై అయిన తర్వాత పరుగులను ఛేదించే జట్టు సూపర్ ఓవర్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తుంది. ఈ కారణంగా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ జట్టు 11 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూపర్ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శించాడు. దీని తర్వాత కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ సూపర్ ఓవర్లో కేవలం 4 బంతుల్లో ఢిల్లీకి విజయాన్ని అందించారు.