IPL 2025: భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం లాంటి పరిస్థితుల కారణంగా గురువారం రాత్రి ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ రద్దు చేయబడింది. ఆ సమయంలో ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్టేడియానికి వచ్చి ధర్మశాల స్టేడియం నుంచి ప్రేక్షకులందరూ వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ధర్మశాల స్టేడియం నుంచి బయలుదేరుతున్నప్పుడు ఒక అభిమాని స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వెలుగులోకి అభిమాని వీడియో
నిజానికి గురవారం రాత్రి పాకిస్థాన్ జమ్మూతో సహా అనేక నగరాలపై కాల్పులు జరిపింది. దీని కారణంగానే ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ ను రద్దు చేశారు. ధర్మశాల స్టేడియం ఒక్కసారిగా చీకటిగా మారింది. ఆటగాళ్లు, ప్రేక్షకులందరినీ అక్కడి నుంచి తరలించారు. ఈ సమయంలో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. "మనం దేనికి భయబడుతున్నాం. మనం మన సొంత దేశంలో ఉన్నాం. భయపడాల్సింది మనం కాదు.. పాకిస్థాన్ భయపడాలి.. భారత్ మాతా కీ జై" అంటూ అభిమాని నినాదం చేశాడు.

అరుణ్ ధుమాల్ వీడియో కూడా వైరల్
భారత్‌లోని అనేక నగరాలపై పాకిస్థాన్ దాడుల తర్వాత ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ధర్మశాల స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌ను ఆపి ప్రేక్షకులందరూ మైదానం నుంచి ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకులందరినీ కూడా మైదానం నుంచి సురక్షితంగా తరలించారు.
ఆటగాళ్ల కోసం ప్రత్యేక రైలు
బీసీసీఐ ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీని ద్వారా ఆటగాళ్లను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రాంతాని సురక్షితంగా తీసుకెళ్తారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్ జరుగుతాయా లేదా వాయిదా పడనున్నాయా అనే విషయంపై ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.