రిటైన్ ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. గురువారం లోపు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్. ఆరుగురిని రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్‌తో వేలంలో సొంతం చేసుకోవచ్చు.
నేరుగా రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను అట్టిపెట్టుకుంటే మాత్రం రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీలు అన్ని దాదాపుగా తమ రిటైన్ లిస్ట్‌ను ఖరారు చేశాయి. కొన్ని ఫ్రాంచైజీలు ఏకంగా కెప్టెన్లనే వదిలిపెట్టాలని నిర్ణయించుకుంది.

ఈ జాబితాలో ఆర్సీబీ కూడా చేరినట్లు తెలుస్తోంది. ఫాప్ డుప్లెసిస్‌ను వదులుకోనుందని సమాచారం. మొదట 40 ఏళ్ల డుప్లెసిస్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకోవాలనుందని భావించింది. ఇటీవల కరేబియన్ లీగ్‌లో సెయింట్ లూసియా కింగ్స్‌ను విజేతగా నిలబెట్టిన డుప్లెసిస్‌కు మరో అవకాశం ఇవ్వాలని యోచించింది. అయితే జట్టు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మరో మూడేళ్లకు తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని యూటర్న్ తీసుకుంది.
దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించడంతో వికెట్ కీపర్-కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించే కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాలని వ్యూహాలు సిద్ధం చేసింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ ఆర్‌టీఎమ్ ఉపయోగించే అవకాశం ఉండటం, వేలంలో రాహుల్‌కు భారీ డిమాండ్ ఉండే అవకాశాలతో బ్యాకప్ ప్లాన్ సిద్ధం చేసింది. విరాట్ కోహ్లికి తిరిగి జట్టు పగ్గాలను కట్టబెట్టాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది.
కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకోవడంతో ఐపీఎల్ 2022 సీజన్ నుంచి ఆర్సీబీని డుప్లెసిస్ నడిపిస్తున్నాడు. గత మూడు సీజన్లలో రెండు సార్లు ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. కానీ 17 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కప్ కలను తీర్చలేకపోయాడు.