IPL 2025: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో వెయ్యి బౌండరీలు సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రెండు బౌండరీలు సాధించి ఈ రికార్డును సాధించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ మూడో బంతికి విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్ బౌలింగ్ లో సిక్స్ బాది ఐపీఎల్ లో 1000 బౌండరీలను పూర్తి చేశాడు.
ఐపీఎల్ లో అత్యధిక ఫోర్లు బాదిన రికార్డు కోహ్లీ పేరిట ఉంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం సిక్సర్ల పరంగా మూడో స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్(357 సిక్సర్లు), రోహిత్ శర్మ(282 సిక్సర్లు) మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. గురువారం కోహ్లీ మొత్తం ఐదు సిక్సర్లు బాది ఉంటే రోహిత్ ను అధిగమించి సిక్సర్లు కొట్టిన జాబితాలో రెండో స్థానానికి చేరుకునేవాడు. ఐపీఎల్ చరిత్రలో 920 బౌండరీలతో శిఖర్ ధావన్ రెండో స్థానంలో నిలవగా.. 899 బౌండరీలు బాదిన డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఐపీఎల్ లో 8వేల పైచిలుకు పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అక్షర్ పటేల్
ఐపీఎల్ 2025 24వ మ్యాచ్ లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ఆర్సీబీని ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. సమీర్ రిజ్వి, అభిషేక్ పోరెల్ లను తొలగించారు. వారి స్థానంలో అశుతోష్ శర్మ ఫాఫ్ డుప్లెసిస్ లను జట్టులోకి తీసుకున్నారు. ఆర్సీబీ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.