IPL 2025 Virat Kohli: విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ గురించి క్రికెట్ అభిమానులకు తెలిసే ఉంటుంది. అప్పుడప్పుడు కోహ్లీ ఆడే మ్యాచులకు అతడు హాజరవుతుంటాడు. అయితే తాజాగా వికాస్.. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. సోషల్ మీడియా వేదికగా అతడికి చురకలు అంటించాడు. ఎందుకంటే?
కోహ్లీపై విమర్శలు..
సంజయ్ మంజ్రేకర్.. గత కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కోహ్లీ.. ఐపీఎల్ 2025లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఉన్నప్పటికీ.. మంజ్రేకర్ ఐపీఎల్ 2025 టాప్ 10 బ్యాటర్ల జాబితాలో కోహ్లీకి చోటు కల్పించలేదు. విరాట్ పేరు లేకుండానే ఇతర ఆటగాళ్ల పేర్లతో జాబితాను పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఆర్సీబీ.. ఒక్కడిపైనే ఆధారపడాల్సిన అవసరం లేదంటూ, ఆ జట్టు విజయాలకు కారణం బౌలర్లని మరో పోస్ట్ పెట్టాడు. ఇంకా ఈ ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై కూడా విమర్శలు చేశాడు.

64లేనోడు.. 200+ను చులకన చేస్తూ..
ఈ పోస్టులు అన్నీ సోషల్ మీడియాలో ఇప్పటికే వివాదానికి దారితీశాయి. కోహ్లీ, ఆర్సీబీ అభిమానులంతా సంజయ్ మంజ్రేకర్ పై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ.. విరాట్- బుమ్రా మధ్య జరిగే ఫైట్ ను 'బెస్ట్ వర్సెస్ బెస్ట్'గా పరిగణించలేమని అన్నాడు. దీంతో ఇంత వరకు సహనంగా ఉన్న వికాస్.. ఇప్పుడు మంజ్రేకర్ పై మండిపడ్డాడు. వన్డేల్లో 64 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేసిన మంజ్రేకర్... 200+ స్ట్రైక్‌రేట్‌తో సులభంగా పరుగులు చేసేవారిని చులకన చేసి మాట్లాడతాడు అని తిరిగి విమర్శలు చేశాడు.
రెండో స్థానంలో కోహ్లీ..
కాగా, కోహ్లీ ఈ సీజన్‌లో ఆడిన పది మ్యాచుల్లో ఏకంగా 6 హాఫ్ సెంచరీలు చేశాడు. 443 పరుగులు చేశాడు. అందులో 39 ఫోర్లు, 13 సిక్సులు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ లిస్టులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆర్సీబీ.. ఆడిన 10 మ్యాచుల్లో ఏడింటిలో విజయం సాధించింది. మూడింటిలో ఓటమి చెందింది. ఆరు విజయలు బయట మైదానంలో నమోదు చేసింది.