IPL 2025: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌ను 100 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 2 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. కానీ రాజస్థాన్ జట్టు కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించడంలో ముంబై ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ కీలక రికార్డును సృష్టించాడు.
ట్రెంట్ బౌల్ట్ రికార్డు
శుక్రవారం ట్రెంట్ బౌల్ట్ టీ20 క్రికెట్‌లో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అనుభవజ్ఞుడైన ఈ న్యూజిలాండ్ బౌలర్ తన మంచి ఫామ్‌ను కొనసాగించి కేవలం 2.1 ఓవర్లలో 28 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్ ఎకానమీ రేటు 12.90గా ఉంది. ట్రెంట్ బౌల్ట్ వేసిన మ్యాచ్ రెండో ఓవర్‌లో యశస్వి జైస్వాల్ రెండు సిక్సర్లు బాదాడు.. కానీ వెంటనే జైస్వాల్‌ను బౌల్ట్ ఔట్ చేశాడు. 4వ ఓవర్లో నితీష్ రానా, రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌల్ట్‌ను ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. కానీ నితీష్ రానా తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన 17వ ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్ బుమ్రాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ విధంగా 3 కీలక వికెట్లు తీసి ట్రెంట్ బౌల్ట్ రికార్డు సృష్టించాడు.

బౌల్ట్ రికార్డు అద్భుతం
ట్రెంట్ బౌల్ట్ 257 మ్యాచ్‌ల్లో 25.10 సగటుతో 302 వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్ బెస్ట్ 4/13 కాగా.. ఎకానమీ రేటు 8.05గా ఉంది. టిమ్ సౌథీ, ఇష్ సోధీ తర్వాత 300 వికెట్లు తీసిన మూడో న్యూజిలాండ్ బౌలర్‌గా ట్రెంట్ బౌల్ట్ నిలిచాడు. గత 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లతో ట్రెంట్ బౌల్ట్ గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. ట్రెంట్ బౌల్ట్ 16 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో ట్రెంట్ బౌల్ట్ అత్యుత్తమ ప్రదర్శన 4/26గా ఉంది.
ముంబై భారీ విజయం
రాజస్థాన్ జట్టు ముందుగా టాస్ గెలిచి ముంబై ఇండియన్స్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ 116 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పడంతో రాజస్థాన్ జట్టు తమ నిర్ణయం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఓపెనర్లు ఇద్దరు ఔటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ముంబైని 20 ఓవర్లలో 217 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో మహీశ్ తీక్షణ, కెప్టెన్ రియాన్ పరాగ్‌లకు తలా ఒక వికెట్ దక్కింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై దాడిని ఎదుర్కోవడంలో రాజస్థాన్ నిస్సహాయంగా కనిపించింది. రాజస్థాన్ 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ అత్యధిక స్కోరు చేయడంతో రాజస్థాన్ 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయి 100 పరుగుల తేడాతో మ్యాచ్ ను కోల్పోయింది.
అగ్రస్థానానికి చేరుకున్న ముంబై జట్టు
ముంబై జట్టు 7 విజయాలు, 4 ఓటములతో 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్ మూడు విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.