ఐపీఎల్ అంటేనే ధనాధన్. ఓవైపు బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి ఆడుతుంటే.. మరోవైపు అదే స్థాయిలో బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులతో వారిని నిలువరిస్తూ ఉంటారు. బౌలర్ల విషయానికొస్తే.. తమ మ్యాజికల్ స్పెల్ తో మ్యాచులను మలుపు తిప్పిన సందర్భాలు ఉన్నాయి. టీ20లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం అరుదే కానీ, అదే సమయంలో అంతకుమించి ప్రదర్శన చేసిన బౌలర్లు కూడా ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలోనే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ను నమోదు చేశారు. మరి ఐపీఎల్ 2025 దగ్గరికి వస్తోన్న నేపథ్యంలో గతంలో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన వారెవరు, ఎలాంటి ప్రదర్శన చేశారు ఓ సారి గుర్తుచేసుకుందాం.
ఐపీఎల్ ఇన్నింగ్స్ లో టాప్ 10 బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఇవే
1. అల్జారి జోసెఫ్ - 6/12 (ముంబయి వర్సెస్ సన్ రైజర్స్, 2019)
వెస్టిండీస్ పేసర్ అల్జారి జోసెఫ్ 2019లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ లైనప్‌ను బలంగా దెబ్బతీశాడు. ఆరు వికెట్లు పడగొట్టి కేవలం 12 పరుగులే సమర్పించుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డును నెలకొల్పాడు.
2. సోహైల్ తన్వీర్ - 6/14 (రాజస్థాన్ వర్సెస్ సీఎస్కే, 2008)
పాకిస్థాన్ ఎడమచేతి వాటం పేసర్ సోహైల్ తన్వీర్.. ఐపీఎల్‌లో తొలి సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై విధ్వంసకర స్పెల్ వేసి బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాడు. అతడి 6/14 బౌలింగ్ ఫిగర్ దశాబ్ద కాలం పాటు అత్యుత్తమ ఐపీఎల్ బౌలింగ్ ఫిగర్ గా నిలిచిపోయింది.

3. ఆడమ్ జంపా - 6/19 (రైజింగ్ పుణె జెయింట్స్ వర్సెస్ సన్ రైజర్స్, 2016)
2016లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరపున ప్రాతినిథ్యం వహించిన అతడు.. తన అద్భుతమైన స్పెల్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను షాక్ తగిలేలా చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ లెగ్ స్పిన్నర్ (6/19) నమోదు చేసిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలివి.
4. అనిల్ కుంబ్లే - 5/5 (ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్, 2009)
2009 IPLలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే 5/5తో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. 1.57 ఎకానమీ రేటుతో ఈ ప్రదర్శన చేశాడు. ఇది ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ ఎకానమికల్ ఫైవ్ వికెట్ హాల్స్ గా నిలిచిపోయింది.
5. ఆకాష్ మధ్వాల్ - 5/5 (ముంబయి వర్సెస్ లక్నో, 2023)
ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌లో ఆకాశ్ మధ్వాల్ ముంబై ఇండియన్స్ హీరోగా నిలిచాడు. అతడు లక్నో సూపర్ జెయింట్స్‌ను 5/5తో ఊచకోత కోశాడు. అప్పుడు అతడి ఎకానమీ 1.42. ఐపీఎల్ లో ఈ మధ్య కాలంలో అత్యంత ప్రభావవంతమైన ప్రదర్శనలలో ఒకటిగా ఇది నిలిచింది.
6. జస్ప్రీత్ బుమ్రా - 5/10 (ముంబయి వర్సెస్ కేకేఆర్, 2022)
ప్రపంచంలోని అత్యుత్తమ T20 బౌలర్లలో ఒకడైన బుమ్రా IPL 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే ప్రదర్శన చేశాడు. మెయిడెన్ ఓవర్ తో కలిపి 5/10తో చెలరేగాడు.
7. మోహిత్ శర్మ - 5/10 (గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబయి, 2023)
IPL 2023లో, మోహిత్ శర్మ ప్లేఆఫ్స్‌లో ముంబై ఇండియన్స్‌పై గేమ్ ఛేంజర్ స్పెల్‌ను వేశాడు. 5 వికెట్లు తీసి కేవలం 10 పరుగులే ఇచ్చాడు. ఇతడి ప్రదర్శన.. ఆ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలకంగా వ్యవహరించింది.
ఇంకా ఇషాంత్ శర్మ - 5/12 (దిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కొచి, 2011), లసిత్ మలింగ - 5/13 (ముంబయి ఇండియన్స్ vs దిల్లీ డేర్ డెవిల్స్, 2011), అంకిత్ రాజ్ పుత్ - 5/14 (KXIP vs SRH, 2018) కూడా ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ను నమోదు చేశారు.