క్రికెట్ అభిమానులకు కిక్ ఎక్కిచ్చే న్యూస్. ఐపీఎల్-2025 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. 2025 సీజన్‌తో పాటు 2027 సీజన్ వరకు షెడ్యూల్ ఖాయమైంది. వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. మే 25వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గత సీజన్ తరహాలోనే ఐపీఎల్-2025లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.
2026 సీజన్ మార్చి 15న ప్రారంభమై మార్చి 31తో ముగుస్తుంది. అలాగే ఐపీఎల్ -2027 సీజన్ మార్చి 14న మొదలై మే 30వ తేదీన ముగుస్తుంది. ఈ రెండు సీజన్లలో 84 మ్యాచ్‌లు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం ఈ షెడ్యూల్స్‌ను అన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ పంపింది. షెడ్యూల్ వివరాలతో పాటు మరో కీలక సమాచారాన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ అందించింది. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మెగావేలంలోకి వస్తున్నాడని తెలిపింది. 575వ ప్లేయర్‌గా ఆర్చర్ ఆక్షన్‌లో అడుగుపెట్టనున్నాడు.

సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించనున్న విషయం తెలిసిందే. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభం కానుంది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. అయితే ఈ మెగావేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ తొలుత 574 మందినే షార్ట్ లిస్ట్ చేసింది.
షార్ట్ లిస్ట్ అయిన వాళ్లలో 366 మంది భారత ఆటగాళ్లు, 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే ఈ జాబితాలో తొలుత జోఫ్రా ఆర్చర్ లేడు. కానీ తాజాగా ఆర్చర్ పేరును లిస్ట్‌లో జతచేసింది. జోఫ్రా ఆర్చర్‌తో పాటు సౌరభ్ నేత్రావల్కర్, హార్దిక్ తమోరె కూడా వేలంలోకి వస్తున్నారు. భారత సంతతికి చెందిన సౌరభ్ యూఎస్‌ఏ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, షార్ట్ లిస్ట్ అయిన 577 మంది ప్లేయర్లలో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు.