IPL 2025: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో కోల్‌కతా నైట్ రైడర్స్ తన ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేయగలిగింది. అంగ్‌క్రిష్ రఘువంశీ 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ జట్టులో డుప్లెసిస్(62), కెప్టెన్ అక్షర్ పటేల్(43) రాణించారు. చివరలో విప్రజ్ నిగమ్(38) పోరాడినా ఫలితం లేకపోయింది.
కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ ఢిల్లీ కొంపముంచాడు. డుప్లెసిస్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ వంటి కీలక ఆటగాళ్లను ఔట్ చేసి ఢిల్లీ నడ్డివిరిచాడు. కేఎల్ రాహుల్ సునీల్ నరైన్ రనౌట్ చేసి పెవిలియన్ కు పంపాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశాడు. అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీశారు.

డుప్లెసిస్, అక్షర్, విప్రజ్ పోరాటం వృథా
205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు తొలి ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. అనుకుల్ రాయ్ బౌలింగ్ లో అభిషేక్ పోరెల్(4) రస్సెల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఫాఫ్ డుప్లెసిస్(62) అద్భుతంగా ఆడాడు. కానీ వైభవ్ అరోరా బౌలింగ్ లో కరుణ్ నాయర్(15) రింకూ సింగ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం 60 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ రనౌట్ గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్(43) డుప్లెసిస్ తో కలిసి అద్భుతంగా ఆడాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ వీరిని సునీల్ నరైన్ విడదీశాడు. 136 పరుగుల వద్ద అక్షర్ పటేల్ ను సునీల్ నరైన్ ఔట్ చేశాడు. అదే ఓవర్ లో మంచి ఫామ్ లో ఉన్న ట్రిస్టన్ స్టబ్స్ ను కూడా ఔట్ చేశాడు. అనంతరం 16వ ఓవర్ రెండో బంతికి డుప్లెసిస్ ఔట్ కావడంతో ఢిల్లీ పరాజయం ఖరారైంది. చివరలో విప్రజ్ నిగమ్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
కోల్ కతా బ్యాటర్లలో రాణించిన రఘువంశీ, రింకూ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక ప్లేఆఫ్స్ పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. కోల్‌కతా బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేయగలిగింది.. ఓపెనర్లలో సునీల్ నరైన్ 27 పరుగులు చేయగా.. రహ్మానుల్లా గుర్బాజ్ 26 పరుగులు చేశాడు. దాంతో కోల్‌కతా పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయగలిగింది. కోల్ కతా వేగంగా పరుగులు చేస్తున్న సమయంలో ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ జోడీని విడదీసి తొలి వికెట్ సాధించాడు. గుర్బాజ్ ఔటైన తర్వాత సునీల్ నరైన్ విప్రజ్ నిగమ్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ అజింక్యా రహానే(26), అంగ్ క్రిష్ రఘువంశీ(44) అద్భుతంగా ఆడారు. అక్షర్ పటేల్ రహానే, వెంకటేశ్ అయ్యర్(7)లను ఔట్ చేసి కోల్ కతా జట్టును కష్టాల్లోకి నెట్టాడు.
అనంతరం కోల్‌కతా బాధ్యతను రఘువంశీ తీసుకున్నాడు. బౌండరీలతో రెచ్చిపోయి జట్టు స్కోరును 150 దాటించాడు. హాఫ్ సెంచరీగా దగ్గరగా వెళ్లిన రఘువంశీని చమీర పెవిలియన్ కు పంపాడు. రఘువంశీ అజింక్యా రహానే, రింకూ సింగ్(36)లతో కలిసి పార్టనర్ షిప్ ను నెలకొల్పాడు. 18వ ఓవర్ మూడో బంతికి రింకూ సింగ్ ను విప్రజ్ ఔట్ చేశాడు. అనంతరం ఆండ్రీ రస్సెల్(17), పావెల్(5), చివరలో ఆడారు. మిచెల్ స్టార్క్ 20వ ఓవర్లో ఆండ్రీ రస్సెల్ తొలి బంతినే సిక్సర్ బాదాడు. రస్సెల్ సిక్సర్ బాదడంతో కోల్ కతా జట్టు 200 మార్కును దాటింది. ఆ ఓవర్లో మూడో బంతికే పావెల్ ఎల్బీగా వెనుదిరగగా.. నాలుగో బంతికి అనుకుల్ రాయ్(0)ని చమీర డైవింగ్ క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు. ఐదో బంతికి రస్సెల్ రనౌట్ గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో కోల్ కతా జట్టు 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. విప్రజ్ నిగమ్ 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ కూడా రెండు వికెట్లు పడగొట్టగా.. చమీర ఒక వికెట్ తీశాడు.