ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభం కానుంది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందినే షార్ట్ లిస్ట్ చేసింది.
వాళ్లలో మొత్తంగా 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్లలో 366 మంది భారత ఆటగాళ్లు, 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే ప్లేయర్లందరిలో శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్‌కు వేలంలో భారీ డిమాండ్ నెలకొంది. ఈ ముగ్గురిపై కాసుల వర్షం కురువడం గ్యారెంటీ. అయితే శ్రేయస్ అయ్యర్ ఏ జట్టును దక్కించుకోనుందా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

ఐపీఎల్-2024లో కేకేఆర్‌ను శ్రేయస్ అయ్యర్ ఛాంపియన్‌గా నిలిపాడు. సారథిగా సీజన్ ఆద్యంతం కేకేఆర్‌ను విజయపథంలో నడిపించాడు. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్.. రింకూ సింగ్ (రూ.13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు), సునీల్ నరైన్ (రూ.12 కోట్లు), ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), హర్షిత్ రాణా (రూ.4 కోట్లు), రమణ్‌దీప్ సింగ్ (రూ. 4 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. రూ.69 కోట్లు వెచ్చించి ఈ ఆరుగురు అట్టిపెట్టుకుని కెప్టెన్‌ను వదిలిపెట్టింది. గాయం కారణంగా 2023 సీజన్‌కు దూరమైన శ్రేయస్.. 2024 సీజన్‌లో 39 సగటుతో 351 పరుగులు చేశాడు.
కాగా, శ్రేయస్ అయ్యర్ గురించి సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''కేకేఆర్ విజేతగా నిలిచినప్పుడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్. అయితే రిషభ్ పంత్ విషయంలో చెప్పినట్లుగా ఫీజు విషయంలో భిన్నాభిప్రాయాలు రావొచ్చు. అయితే వేలంలో శ్రేయస్ వచ్చినప్పుడు కేకేఆర్ కూడా బిడ్ వేయొచ్చు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అతని కోసం ప్రయత్నించవచ్చు. పంత్ దక్కని సందర్భంలో కెప్టెన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయస్ కోసం తప్పక ట్రై చేస్తుంది. అలాగే పంత్ కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగిస్తుంది'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.