ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు విరుచుకుపడ్డారు. దీంతో సన్‌రైజర్స్ భారీ హిట్టర్లు పెవిలియన్ కు క్యూ కట్టాల్సివచ్చింది. 300 స్కోరు అంచనాలతో బరిలోకి దిగిన ఆ జట్టును నిర్ణీత 20 ఓవర్లో 190 పరుగులకే కట్టడి చేశారు. శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సన్‌రైజర్స్ పతనం శాసించగా, ప్రిన్స్ యాదవ్, ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రథి, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
ట్రావిస్ హెడ్ (47; 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన అనికేత్ వర్మ (36; 13 బంతుల్లో) మెరుపులు మెరిపించాడు. నితీశ్ రెడ్డి (32; 28 బంతుల్లో), హెన్రిచ్ క్లాసెన్ (26; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) మంచిగానే రాణించారు. పాట్ కమిన్స్ (18; 4 బంతుల్లో) హ్యాట్రిక్ సిక్స్‌లు బాది పెవిలియన్ చేరాడు. అభిషేక్ శర్మ (6), ఇషాన్ కిషన్ (0), అభినవ్ మనోహర్ (0) నిరాశ పరిచారు.

మ్యాచ్ సాగిందిలా..
ఈ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ఆరంభంలోనే షాకిచ్చాడు శార్దూల్ ఠాకూర్. హైదరాబాద్ జట్టు 15 పరుగులకే.. 2.2 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిపోయేలా చేశాడు. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి అదరగొట్టాడు. మొదట ఠాకూర్ వేసిన 2.1 ఓవర్ కు నికోలస్ పూరన్ ను క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు అభిషేక్ శర్మ(6). ఇషాన్ కిషన్.. వికెట్ కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుదిరిగాడు. అయితే శార్దూల్ ఠాకూర్ వేసిన మూడో బంతిని నితీష్ కుమార్ రెడ్డి అడ్డుకున్నాడు. అతడు కాసేపు క్రీజులో ట్రావిస్ హెడ్ తో కలిసి దీటుగానే ఆడాడు. అయితే దూకుడుగా ఆడిన ట్రావిస్ హెడ్ కు.. పూరన్, బిష్ణోయ్ క్యాచ్‌లు వదిలేయడంతో రెండు సార్లు లైఫ్ వచ్చింది. కానీ ఆ తర్వాత ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్లాసెన్ ఊహించని రీతిలో రనౌట్ అయ్యాడు.
సిక్సర్లతో చెలరేగి ఆడిన అనికేత్..
క్లాసెన్ ఔటైన తర్వాత క్రీజోలోకి వచ్చిన అనికేత్ వరుస సిక్సర్లతో చెలరేగి ఆడాడు. నితీశ్ కుమార్ ఔటైనప్పటికీ మరో ఎండ్‌లో అతడు విజృంభించి ఆడాడు. కానీ దూకూడుగా ఆడుతూ డేవిడ్ మిల్లర్ చేతికి చిక్కాడు. అనంతరం జోరుమీదున్న కమిన్స్‌ను అవేశ్ ఖాన్ వెనక్కి పంపాడు.